Deputy CM Bhatti Vikramarka Review on Power Department : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి పెరగనున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో విద్యుత్(Electricity) కొరత ఉండకూడదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం రామగుండం ఎన్టీపీసీ ఫేజ్-2లో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి థర్మల్ విద్యుత్ కేంద్రాల(Thermal Power Stations) నిర్మాణాలను త్వరిత గతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఎన్టీపీసీతో సంప్రదింపులు జరపాలని చెప్పారు.
తొలి విడతలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ : సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో అదనంగా 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్ నిర్మాణం పనులను చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అందులో తొలి విడతలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఎన్టీపీసీ నిర్మాణం చేస్తోందని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు.