ఏటా ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20 వరకు అగ్నిమాపక శాక అవగాహన సదస్సులను నిర్వహిస్తుండగా.. బుధవారం ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా ఈ శాఖ అధికారులు.. ‘ఫైర్ అలారం ధర రూ.800.. స్మోక్/ఫైర్ డిటెక్టర్ ధర రూ.1,200, ఫైర్ ఎక్స్‌టింగ్‌షర్‌కు రూ.3,000.. వీటి మొత్తం ధర రూ.5,000. మరి, మీ కుటుంబం విలువ రూ.5,000 కంటే తక్కువా?’ అంటూ ప్రజలకు అర్థమయ్యేలా, వారిని ఆలోచింపజేసేలా ప్రచారం చేస్తున్నారు. ఇళ్లల్లో వ్యక్తిగతంగా ఇంతటి తక్కువ ఖర్చుతో అగ్నిమాపక పరికరాల్ని ఏర్పాటు చేసుకుంటే.. ప్రమాదాల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు అంటూ వివరిస్తున్నారు.
గ్యాస్ లీక్ జరిగితే..
గ్యాస్ లీక్ అయితే వెంటనే రెగ్యులేటర్ వాల్వు ఆపేయండి. ఎలక్ట్రికల్ స్విచ్‌లు ఆన్/ఆఫ్ చేయొద్దు. దేవుని దీపాలు, అగర్‌బత్తీలు ఆర్పివేయాలి. కిటికీలు, తలుపులను తెరవాలి. గ్యాస్ లీక్ అయి అగ్నిప్రమాదం సంభవించిన సందర్భాల్లో రెగ్యులేటర్ వాల్వును ఆఫ్ చేసే అవకాశం లేకపోతే తడిసిన గోనెసంచి/తడిబట్టను మండుతున్న సిలిండర్‌పై వేస్తే మంట ఆగిపోతుంది. ఎల్‌పీజీ గ్యాస్‌కు సంబంధించిన సహాయానికి 1906 నంబర్‌కు కాల్ చేయాలి.