తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆందోళనలో ప్రధానోపాధ్యాయులు.. టీచర్ల కొరతే ప్రధానకారణం - తెలంగాణలో ఉన్నత పాఠశాలలు

Shortage of Teachers: రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నత పాఠశాలల్లో విద్యా పరిస్థితులపై ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సరిపడా టీచర్లు లేకపోవడంతో పిల్లలకు పాఠాలు ఎవరితో చెప్పించాలో తెలీక సతమతమవుతున్నారు. విద్యా వాలంటీర్లను నియమించలేదు. సబ్జెక్టు నిపుణుల కొరత తీరలేదు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులను బదిలీ చేసినా వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదు. అలాంటి చోట్ల పాఠాలు చెప్పేదెవరనేది ప్రధానోపాధ్యాయులను వేధిస్తున్న ప్రశ్న.

Shortage of Teachers
టీచర్ల కొరత

By

Published : Jan 21, 2022, 8:22 AM IST

''మెదక్‌ జిల్లా రేగోడు మండలం జెగిర్యాల్‌ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులుండగా ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు, మరో ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. హెచ్‌ఎం మరో బహుళ జోన్‌కు వెళ్లిపోగా... ఆ స్థానంలో ఎవరూ రాలేదు. ఖాళీగా ఉన్న అయిదు పోస్టులను కూడా భర్తీ చేయలేదు. విద్యా వాలంటీర్లను నియమించడం లేదు. మరి ఇప్పుడు ఆ విద్యార్థులకు పాఠాలు బోధించేదెవరు?''

Shortage of Teachers: తెలంగాణలో చాలాచోట్ల ఉన్నత పాఠశాలల్లో బదిలీ స్థానాలను విద్యాశాఖ భర్తీ చేయడం లేదు. విద్యా వాలంటీర్ల నియామకమూ చేపట్టడంలేదు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులను బదిలీ చేసినా.. వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. సరిపడా టీచర్లు లేక పాఠాలు ఎవరితో చెప్పించాలో తెలియక ప్రధానోపాధ్యాయులు సతమతమవుతున్నారు. కొన్ని హైస్కూళ్లలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం ఉన్న చోట్ల ఒక్కో సబ్జెక్టుకు ఒకే ఉపాధ్యాయుడిని కేటాయించడం సమస్యగా మారనుంది. పదో తరగతి పరీక్షల ఫీజుల తేదీలు ప్రకటించిన తర్వాత కూడా సబ్జెక్టు నిపుణుల స్థానాలను భర్తీ చేయకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

హేతుబద్ధీకరణ లక్ష్యం నెరవేరింది ఎంత?

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.09 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా...అందులో సుమారు 23 వేల మంది జిల్లాలు మారారు. పోస్టింగులు కేటాయించడంలో పాక్షికంగా మాత్రమే హేతుబద్ధీకరణ చేశామని విద్యాశాఖ వర్గాలు అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. ఉపాధ్యాయులను కొంత వరకు సర్దుబాటు చేసినా పాఠశాలల హేతుబద్ధీకరణ కూడా జరిగితేనే సబ్జెక్టు నిపుణుల కొరత పూర్తిగా తీరుతుందని డీఈవో ఒకరు వ్యాఖ్యానించారు. ఉదాహరణకు 50 మంది విద్యార్థుల లోపున్న ఉన్నత పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నాయి. హైస్కూల్‌లో 10 మంది ఉన్నా ఒక ప్రధానోపాధ్యాయుడు, మరో ఏడుగురు సబ్జెక్టు నిపుణులను నియమించడం తప్పనిసరి. అలాంటి వాటిని సమీపంలోని వాటిల్లో విలీనం చేసినప్పుడే సబ్జెక్టు నిపుణుల కొరత తీరి విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటుందని జిల్లా స్థాయి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే ఉపాధ్యాయులందరినీ ఇతర జిల్లాలకు పంపినా...అక్కడున్న పిల్లల్ని ఏం చేయబోతున్నామని మాత్రం విద్యాశాఖ ఇప్పటి వరకు చెప్పడం లేదు. ఈనెల 31 నుంచి మళ్లీ పాఠశాలలు తెరుచుకుంటే అక్కడ బోధించేదెవరు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

కొన్ని చోట్ల ఇదీ పరిస్థితి...

  • కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం వచ్చునూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు మొత్తం 9 తొమ్మిది మంది. ఇక్కడ ఆరుగురు పనిచేస్తున్నారు. అయిదుగురు ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఒక్క హెచ్‌ఎం మాత్రమే ఉన్నారు. మరి తొమ్మిది మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేదెవరు? ఈ పాఠశాలకు సమీప గ్రామాల్లో ఉన్నత పాఠశాలలున్నాయి? వాటిల్లో దీన్ని విలీనం చేస్తారా? దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు.
  • మహబూబ్‌నగర్‌ జిల్లా పీసీకుంట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం ఉండగా జీవశాస్త్రం బోధించే ముగ్గురు ఉపాధ్యాయులు వేరే జిల్లాలకు వెళ్లారు. తిరిగి ఇక్కడకు ఒక్కరే వచ్చారు. సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు ముగ్గురు ఉండగా... వారు వెళ్లి ఒక్కరే కొత్తగా వచ్చారు. అంటే తెలుగు, ఆంగ్ల మాధ్యమం విద్యార్థులందరికి కలిపి ఒక ఉపాధ్యాయుడే బోధిస్తారా?

అదే జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి పాఠశాలలో బయోసైన్స్‌ ఉపాధ్యాయులు ఇద్దరు వెళ్లిపోగా...ఒక్కరూ రాలేదు. ఇక్కడే నవాబుపేట మండలం కారుకొండలో తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ముగ్గురు గణితం ఉపాధ్యాయులు ఉండగా... వారు బదిలీ అయ్యారు. తిరిగి ఒక్కరే వచ్చారు.... ఇది దేనికి సంకేతం?

ఇదీ చూడండి:Registration charges: మరోసారి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. వచ్చేనెల నుంచే అమలు..!

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details