* సంగారెడ్డి జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడి తండ్రి కరోనాతో చనిపోయారు. రెండేళ్ల క్రితమే తల్లి చనిపోగా ఇప్పుడు తండ్రి మృతితో బాలుడు ఒంటరివాడు అయ్యాడు. ఈ సమాచారం అందుకున్న శిశు సంక్షేమశాఖ ఆ బాలుడిని కలిసి కౌన్సెలింగ్ ఇచ్చి బాలల సంరక్షణ కేంద్రంలో చేర్పించింది. బాలుడు చదువుకునేందుకు ఏర్పాట్లు చేసింది.
* సూర్యాపేటలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోయారు. ఆయనకు భార్య, మూడేళ్ల బాలుడు ఉన్నారు. భార్య గర్భిణి కావడంతో.. ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని కాల్‌సెంటర్‌కు సమాచారం వచ్చింది. అంగన్‌వాడీ టీచర్, జిల్లా సంరక్షణ కమిటీ.. వారిని కలిసి రెండు నెలలకు సరిపడ సరకులు అందించింది. భవిష్యత్తులో మరింత సహాయం చేసేందుకు శిశు సంక్షేమశాఖ పర్యవేక్షిస్తోంది.
* ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారి పిల్లలకు కరోనా పరీక్షలు చేయించాలని ఫోన్ రాగా, శిశు సంక్షేమాధికారులు స్థానిక వైద్యాధికారిని సంప్రదించి పరీక్షలు పూర్తి చేశారు.
ఇందుకోసం శిశు సంక్షేమశాఖ ప్రత్యేకంగా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి కాల్ వచ్చిన వెంటనే స్థానిక అంగన్‌వాడీ టీచర్ సహాయంతో వివరాలు సేకరించి జిల్లా బాలల సంరక్షణ అధికారి (సీడీపీవో), సీడబ్ల్యూసీ, డీసీపీయూ యూనిట్ల ద్వారా అవసరమైన సహాయం అందిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో కరోనాతో భార్యాభర్తలు చనిపోవడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలిసిన శిశు సంక్షేమ అధికారులు అక్కడికి వెళ్లి వివరాలు తీసుకున్నారు. పిల్లలకు మంచి చదువు చెప్పించేలా గురుకులాల్లో సీటు కావాలని, మిగతా బాధ్యతలు తాము చూసుకుంటామని పిల్లల బంధువులు చెప్పారని, ఆ మేరకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
రాష్ట్రంలోని అసహాయ చిన్నారుల సంరక్షణ, సహాయం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నం:040-23733665 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు) ఛైల్డ్ హెల్ప్‌లైన్ నం: 1098 (24 గంటలు)