Rahul Gandhi Ou permission Denial: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతినిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అనుమతిచ్చేలా ఓయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలని కోరుతూ... ఎన్‌ఎస్‌యూఐ నేతల అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఓయూ రిజిస్ట్రార్ అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ... ఎన్‌ఎస్‌యూఐ నేతలు మానవతారాయ్, మరో ముగ్గురు దాఖలు చేసిన హౌస్‌మోషన్‌పై... జస్టిస్ విజయసేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. రాజకీయ కార్యక్రమాలకు అనుమతివ్వరాదని... గతేడాది పాలక మండలి తీర్మానించిందని ఓయూ తరఫు న్యాయవాది జగన్నాథరావు తెలిపారు. పాలకమండలి తీర్మానంపై అభ్యంతరం చెప్పకుండా... దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయడం తగదన్నారు.
బయటి వ్యక్తులు కూడా: మరోవైపు యూనివర్సిటీలో పరీక్షలు, ఉద్యోగ సంఘాలు ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు. పిటిషనర్లు యూనివర్సిటీలో రెగ్యులర్ విద్యార్థులు కాదని.. ఇలాంటి వాటికి అనుమతిస్తే బయటి వ్యక్తులు కూడా అనుమతి కోరతారన్నారు. రాహుల్‌గాంధీ ముఖాముఖి కేవలం విద్యార్థులను చైతన్య పరిచేందుకేనని... రాజకీయ ఉద్దేశాలు లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాది కరుణాకర్‌రెడ్డి వాదించారు. ఠాగూర్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించడం వల్ల ఉద్యోగ సంఘాల ఎన్నికలకు, పరీక్షలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొన్నారు. ఇదే యూనివర్సిటీలో ఫిబ్రవరి 17న జరిగిన సీఎం పుట్టినరోజు వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారని గుర్తుచేశారు. జార్జిరెడ్డి జయంతి, భాజపా ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారని పేర్కొన్నారు.
అనుమతివ్వలేం: ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు... కీలక వ్యాఖ్యలతో పిటిషన్‌ను కొట్టివేసింది. యూనివర్సిటీ క్యాంపస్‌ను రాజకీయాలకు వేదికగా వినియోగించరాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో సీఎం జన్మదిన వేడుకలు, భాజపా మాక్ అసెంబ్లీ, జార్జిరెడ్డి జయంతి జరిగాయన్న కారణంగా... ఓయూ పాలక మండలికి విరుద్ధంగా రాహుల్‌గాంధీ ముఖాముఖికి అనుమతివ్వలేమని హైకోర్టు తెలిపింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు పాజిటివ్ అంశాలకే వర్తిస్తుందని... నెగెటివ్ విషయాలకు కాదని వ్యాఖ్యానించింది. పరీక్ష కేంద్రాలకు ఠాగూర్ ఆడిటోరియం 2 కిలోమీటర్ల దూరం ఉందన్న వాదన కూడా ఆమోదయోగ్యం కాదని హైకోర్టు తెలిపింది.