కొవిడ్ దృష్ట్యా ఈసారి కొత్త సంవత్సర వేడుకలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్‌లో ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఒకే చోట పెద్ద ఎత్తున గుమిగూడ వద్దని సూచించారు. ప్రధానంగా ఎక్కువ రద్దీ ఏర్పడే ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్టీయూ, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్‌లతో పాటు... దుర్గం చెరువు తీగల వంతెన మూసివేయనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. బాహ్యవలయ రహదారి, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రేపుకార్లు, జీపులకు అనుమతి నిషేధించారు. ఇవాళ రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 5 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. బాహ్యవలయ రహదారిపై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను, సరుకు రవాణ వాహనాలను అనుమతిస్తారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫాం ధరించాలని పోలీసులు సూచించారు.
పలు మార్గాల్లో రాకపోకలు నిషేధం
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించినట్టు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బేగంపేట పైవంతెన మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జిలను రాత్రి నుంచి రేపు ఉదయం వరకు మూసివేయనున్నారు. అటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ కామినేని, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జిలను మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, చింతలకుంట అండర్ పాస్‌లను మూసివేయనున్నారు.