DENGUE CASES IN TELANGANA: దోమలు కాటేస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు ఇలా ప్రతి చోట దోమకాటుకు గురవుతున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా డెంగీ బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 3000 పైగా డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. నగరంలో ఇప్పటివరకు దాదాపు 13వేల వరకు డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందులో 1500 మంది వరకు పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తున్న అంశం.
అంటే సుమారు 12 శాతానికిపైగా పాజిటివిటీ రేట్ ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ సహా ఖమ్మం, కరీంనగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలపై డెంగీ ప్రభావం ఎక్కువగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీనికితోడు సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్న పరిస్థితి. ఒకరి నుంచి మరొకరికి ఈ ఫ్లూ లక్షణాలు వేగంగా వ్యాపిస్తుండటంతో బాధితులు ఆస్పత్రులబాట పడుతున్నారు.
గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు జ్వర బాధితులు:హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు జ్వర బాధితులు వందల సంఖ్యలో వస్తున్నారు. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే ఓపీ కింద నిత్యం దాదాపు వెయ్యి మంది వస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. గత నెలలో సుమారు 170మంది ఫీవర్ ఆస్పత్రిలో డెంగీకి చికిత్స పొందగా.. ప్రస్తుతం దాదాపు 40మంది డెంగీ రోగులు, మరో 120మంది జ్వర బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వార్డులు దాదాపు నిండిపోవటంతో ఇతర వార్డుల్లో రోగులను సర్దుబాటు చేస్తున్నారు.