తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయ భవనాల కూల్చివేత... యంత్రాలతోనే నేలమట్టం - Demolition of secretariat news

సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తిగా యంత్రాలతోనే భవనాలను నేలమట్టం చేయనున్నారు. అన్ని భవనాల కూల్చివేత పూర్తయ్యేందుకు కనీసం 5 రోజుల సమయం పడుతుందని ఓ అంచనా. వ్యర్థాల తరలింపు బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగించారు.

Demolition of secretariat buildings in Hyderabad
సచివాలయ భవనాల కూల్చివేత

By

Published : Jul 8, 2020, 5:25 AM IST

కొత్త సచివాలయ భవన నిర్మాణానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత భవనాల కూల్చివేత ప్రక్రియ చేపట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రక్రియ ప్రారంభంకాగా... ప్రొక్లెయిన్లు, జేసీబీల సహాయంతో భవనాలను నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతకు వివిధ రకాల పద్దతులు ఉన్నా... పక్కనే తెలుగుతల్లి పై వంతెన, మింట్‌కాంపౌండ్‌ సహా హోంసైన్స్ కళాశాల వంటి పురాతనభవనాలు, హుస్సేన్‌సాగర్ జలాశయం ఉన్నందున కేవలం యంత్రాల సాయంతో భవనాలు కూల్చేవేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టంచేశారు.

నేలమట్టం..

సచివాలయ ప్రాంగణంలోని పురాతన, చారిత్రక కట్టడమైన జీ-బ్లాక్ సర్వహితను తొలుత నేలమట్టం చేశారు. సచివాలయ ప్రవేశద్వారం పక్కనే ఉన్న విద్యుత్ శాఖకు చెందిన రాతికట్టడాన్ని... సీఎం కార్యాలయం ఉండే సీ- బ్లాక్ సమత భవనాన్ని ఓ వైపు కూల్చేశారు. మిగిలివాటిని తొలగించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రాత్రి సమయంలోనూ భవనాలను నేలమట్టం చేసే ప్రక్రియ కొనసాగింది.

మొత్తం 10 బ్లాకులు..

సచివాలయ ప్రాంగణంలో మొత్తం 10 బ్లాకులుండగా... అందులో జే, ఎల్ బ్లాకులు అత్యంత పెద్దవి. ఎత్తు, విస్తీర్ణంపరంగా ఆ రెండు బ్లాకులు పెద్దవే. 10 బ్లాకులతో పాటు ఇతర నిర్మాణాలున్నాయి. సచివాలయ ప్రాంగణంలోని అన్ని నిర్మాణాలు కూల్చివేసే ప్రక్రియ పూర్తయ్యేందుకు... కనీసం 5 రోజుల సమయం పడుతుందని ఓ అంచనా. ప్రతి భవనాన్ని నేలమట్టం చేసేముందు ఆ భవనానికి ఉన్న అద్దాలు, ఇనుము సహా ఇతరత్రాలు తొలగించనున్నారు. ఆ తర్వాతే... భవనాలు నేలమట్టం చేయనున్నారు.

రాత్రి సమయంలో..

కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలను తరలించే బాధ్యతను హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు అప్పగించారు. వ్యర్థాల పరిమాణం భారీగానే ఉండనుంది. ఒక బ్లాక్ పూర్తి నేలమట్టమైతే దాని ఆధారంగా వ్యర్థాలకు సంబంధించి ఓ అవగాహనకు రావచ్చని అధికారులు చెబుతున్నారు. వ్యర్థాలను పూర్తిగా రాత్రి సమయంలో తరలించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చూడండి:బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాస్తే అందరూ నవ్వారు: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details