రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రణాళిక విభాగం రంగంలోకి దిగి హైదరాబాద్‌లో సుమారు 150 భవనాలను కూల్చివేసింది. అవన్నీ ఒక్క శేరిలింగంపల్లి జోన్‌కు చెందినవే కావడం గమనార్హం. మిగిలిన ఐదు జోన్ల అధికారులు మంత్రి ఆదేశాలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో నిత్యం వందల సంఖ్యలో అనుమతి లేని భవనాలకు భూమి పూజ జరుగుతుంది. అధిక శాతం నిర్మాణాలు ఒకట్రెండు అంతస్తులవికాగా.. 30 నుంచి 40 శాతం ఎత్తయిన భవనాలు. వాటి కారణంగా కాలనీల్లో, వీధుల్లో భూగర్భ మురుగునీటి ప్రవాహ వ్యవస్థ అధ్వానంగా మారుతోంది. రహదారులు ధ్వంసమవుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే కాలనీలు నీట మునుగుతున్నాయి. వరద నీటి సహజ ప్రవాహ మార్గాలు ఆక్రమణకు గురవుతున్నాయి. రోడ్లు ఇరుకై అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ అక్రమాలను, వాటి వల్ల కలిగే పరిణామాలను నియంత్రించాల్సిన ప్రణాళిక విభాగం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలొస్తున్నాయి. ఫలితంగా.. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కావాల్సిన శివారులు సైతం మురికివాడల్లా మారుతున్నాయి. మౌలిక సౌకర్యాల కల్పన కష్టసాధ్యమవుతోంది.
అయ్యప్ప సొసైటీ నుంచి ఆరంభం
మంత్రి ఆదేశాల నేపథ్యంలో చేపట్టిన ప్రత్యేక కూల్చివేతల కార్యక్రమం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ నుంచి మొదలైంది. అక్కడ 52 అపార్ట్‌మెంట్లను కూల్చేశారు. సమీపంలోని గోకుల్‌ప్లాట్స్ ప్రాంతంలో 46 భవన సముదాయాలను, శేరిలింగంపల్లి జోన్‌లోని శేరిలింగంపల్లి సర్కిల్‌లో 38 భవనాలకు చెందిన 161 శ్లాబులను కూల్చామని ప్రణాళిక విభాగం ఉన్నతాధికారి తెలిపారు. అదే జోన్‌లోని చందానగర్, యూసుఫ్‌గూడ, పటాన్‌చెరు సర్కిళ్లలోనూ కూల్చివేతలు ప్రారంభిస్తామని చెప్పారు. మిగిలిన చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్లలో మాత్రం మంత్రి ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. ఐటీ కారిడార్‌తో సమానంగా ఎల్బీనగర్, కూకట్‌పల్లి జోన్లలోని ప్రభుత్వ భూములు, వివాదాస్పద స్థలాలు, చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా ప్రణాళిక విభాగం పట్టించుకోవట్లేదు. చార్మినార్ జోన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వాటిపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ప్రణాళిక విభాగం అధికారులు స్పందించడంలేదు. కూల్చివేతలకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగమూ నిర్లక్ష్యం వహిస్తోంది. పెద్దఎత్తున సమకూర్చుకున్న కూల్చివేత వాహనాలు, ఇతర అద్దె వాహనాలు నిరుపయోగంగా మారాయి.
ఇదీ చూడండి :షేక్‌పేట్ తహసీల్దార్, ఆర్‌ఐను అనిశాకు పట్టించిన వ్యక్తి అరెస్టు