యూరియా తప్ప మిగిలిన ఎరువుల ధరలను కంపెనీలు తగ్గించాయి. యూరియా కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంది. దాని ధర పెంచాలన్నా... తగ్గించాలన్నా... కేంద్ర రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాలి. మిగిలిన ఎరువులపై కేంద్రానికి నియంత్రణ లేదు. మార్కెట్ పరిస్థితులను బట్టి కంపెనీలే ధరలు నిర్ణయిస్తాయి. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం ప్రారంభమై 50 రోజులు అవుతోంది. అయినా సరైన వర్షాలు కురవకపోడం, రైతుల నుంచి గిరాకీ సన్నగిల్లడం వెరసి ఎరువుల అమ్మకాలు తగ్గిపోవడం వల్ల అనివార్యంగా కంపెనీలు దిగొచ్చాయి. డీఏపీ 50 కిలోల బస్తా ధరపై 100 రూపాయలు, కాంప్లెక్స్ ఎరువులపై గరిష్టంగా 110 రూపాయల వరకు తగ్గించినట్లు ఇఫ్కో కంపెనీ శుక్రవారం ప్రకటించింది.
రైతులపై తగ్గనున్న భారం
కంపెనీలు అనేక రకాల బ్రాండ్ల పేరిట రసాయన ఎరువులను విక్రయిస్తున్నాయి. ఇఫ్కో నుంచి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్ సంస్థకు ఎరువులు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు - ప్యాక్స్ ద్వారా మార్క్‌ఫెడ్ ఎరువులు విక్రయిస్తోంది. తాజాగా తగ్గించిన ధరల ప్రకారమే ఎరువులను రైతులకు విక్రయించాలని మార్క్‌ఫెడ్‌తోపాటు ఇఫ్కో కంపెనీ గ్రామాల్లో విక్రయదారులకు లిఖితపూర్వకంగా సందేశాలు పంపించింది. రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో మొత్తం 18 లక్షల టన్నుల ఎరువులు రైతులు కొనుగోలు చేస్తారని వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఇందులో 9 లక్షల టన్నులు యారియా ఉంది. మిగిలిన 9 లక్షల టన్నులపై ధరల తగ్గింపు వల్ల రైతులకు దాదాపు 180 కోట్ల రూపాయల వరకు భారం తగ్గుతుందని అంచనా.