తెలంగాణ

telangana

ETV Bharat / state

"ధరణికోట నుంచి ఎర్రకోట వరకు" నినాదంతో.. అమరావతి రైతుల దిల్లీ యాత్ర - దిల్లీలో అమరావతి రైతుల యాత్ర వార్తలు

Amaravati Farmers Yatra : ఏపీలో రాజధానుల ప్రకటన చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు.. పూర్తయ్యింది. శాసనసభలో సీఎం జగన్‌ ప్రకటనతో.. రాజధాని గ్రామాల్లో "అమరావతి పరిరక్షణ ఉద్యమం" ఉవ్వెత్తున ఎగిసింది. ప్రభుత్వ అణచివేతలు, నిర్బంధాలన్నింటినీ అన్నదాతలు అధిగమించారు. భూములిచ్చి మమ్మల్ని ప్రభుత్వం నిలువునా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తూ నిర్విరామంగా ఉద్యమాన్నికొనసాగిస్తున్నారు. "ధరణికోట నుంచి ఎర్రకోట వరకు" నినాదంతో వైసీపీ ప్రభుత్వ తీరుపై దిల్లీ యాత్ర చేపట్టారు. హస్తిన వేదికగా తమ గళాన్ని వినిపించడానికి అన్నదాతలు సిద్ధమయ్యారు.

Amaravati
Amaravati

By

Published : Dec 17, 2022, 10:28 AM IST

Amaravati Farmers Yatra : ఆంధ్రప్రదేశ్​లో గత ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించడంతో.. ఆ ప్రాంత ప్రజలు, రైతులు ఎంతో సంబరపడిపోయారు. ఎంతో చరిత్ర కలిగి, రాష్ట్రానికి మధ్యన ఉండటంతో.. అన్ని ప్రాంతాల ప్రజలూ హర్షం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేల ఎకరాలను రాజధాని రైతులు.. రాష్ట్ర భవిష్యత్‌ కోసం దానం చేశారు. తీరా ప్రభుత్వం మారిపోవడంతో రాజధాని పనులు ఆగిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే 3 రాజధానులు ప్రకటన చేయడంతో అమరావతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ప్రజల ఆకాంక్షే పార్టీల అజెండా:ఎన్నో కలలు గన్న రాజధాని రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతూ నేటికీ ఉద్యమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులు ప్రకటించి నేటికి మూడేళ్లు పూర్తవడంతో.. దిల్లీ గడ్డపై గట్టిగా చాటేందుకు సిద్ధమయ్యారు. పార్టీలు వేరు, అభిప్రాయాలు వేరు, సిద్ధాంతాలు వేరు.. అయినా అంతా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలనే ఏకాభిప్రాయం కోసం ఒక్కటయ్యారు. ప్రజల ఆకాంక్షే పార్టీల అజెండా అంటూ ఏకతాటిపైకి వచ్చారు.

అన్ని రకాల్లోనూ తమ గళాన్ని వినిపించారు:పాదయాత్రలు, నిరాహారదీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ప్రార్థనలు, యాగాలు.. ఇలా ఎన్ని రకాల్లో నిరసన తెలపాలో అన్ని రకాల్లోనూ తమ గళాన్ని వినిపించారు. పోలీసు నిర్బంధాల్ని ఎదుర్కొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికీ వెరవకుండా వివిధ రూపాల్లో పోరాటాన్ని కొనసాగించారు. వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు వీరికి బాసటగా నిలిచాయి.

ధరణికోట నుంచి ఎర్రకోట వరకు నినాదం: అమరావతి పరిరక్షణ కోసం రాజకీయ పక్షాలను ఒకతాటిపైకి తీసుకొచ్చి.. మద్దతు కూడగట్టడంలో రైతులు విజయం సాధించారు. ఇప్పుడు దేశ రాజధాని దిల్లీ వరకు తమ ఉద్యమ నినాదాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. ధరణికోట నుంచి ఎర్రకోట వరకు నినాదంతో వైసీపీ తీరును ఎండగడుతూ దిల్లీ యాత్ర చేపట్టారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన చేసినందున కేంద్రానికి బాధ్యత ఉందని గుర్తుచేసేలా పయనమయ్యారు.

తమకు జరుగుతున్న అన్యాయం:ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్‌మంతర్‌ వద్ద రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. దిల్లీ వెళ్లిన రైతులు, మహిళలు బృందాలుగా విడిపోయి.. వివిధ పార్టీల అధ్యక్షులు, ఎంపీలను కలసి తమకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తారు. 19న రామ్‌లీలా మైదానంలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి ప్రత్యేక రైలులో దిల్లీ నుంచి బయలుదేరి 21వ తేదీ ఉదయానికి విజయవాడ చేరుకుంటారు.

అమరావతి పరిరక్షణ ఉద్యమం:రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఎన్నికల ముందు వైసీపీ నాయకులు చేసిన ప్రకటనలతో.. ప్రభుత్వం మారినా రాజధాని ప్రజలు భరోసాగానే ఉన్నారు. కొంచెం నెమ్మదిగానైనా రాజధాని నిర్మాణం కొనసాగుతుందని నమ్మారు. కానీ 2019 డిసెంబరు 17న సాయంత్రం అసెంబ్లీలో సీఎం జగన్‌ చేసిన మూడు రాజధానుల ప్రస్తావన వారికి శరాఘాతమైంది. ఆ మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో ఉద్ధృతంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. డిసెంబరు 18న వెలగపూడిలో తొలి దీక్షా శిబిరం మొదలైంది.

అమరావతే ఆశ, శ్వాసగా పోరాటం: అప్పటి నుంచి రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు అమరావతే ఆశ, శ్వాసగా పోరాడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రాజధాని ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాజధాని ఉద్యమంలో ఇప్పటి వరకు పోలీసులు దాదాపు 3,000 మందికి పైగా కేసులు నమోదు చేశారు. వారిలో ఒక్కొక్కరిపై 20-30 కేసులు నమోదైనవారూ ఉన్నారు. వాటిలో పలు ఎస్సీ, ఎస్టీ కేసులూ ఉన్నాయి. ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం.. హైకోర్టు చివాట్లు పెట్టడం వంటి ఘటనలూ అనేకం.

వేల సంఖ్యలో పోలీసు బలగాలు: అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలయ్యాక ఇప్పటి వరకు దాదాపు 200మందికి పైగా రైతులు, రైతు కూలీలు మానసిక వేదనతో మరణించారు. రైతుల ఉద్యమం మొదలయ్యాక రాజధాని గ్రామాల్లోకి ప్రభుత్వం వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని దించింది. దాదాపు గ్రామాలన్నింటినీ దిగ్బంధించింది. 144 సెక్షన్ ప్రయోగించి.. ఉద్యమాన్ని కట్టడి చేయాలని చూసింది. కనక దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుని, తమ గోడు వెళ్లబోసుకునేందుకు రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో బయల్దేరిన మహిళల్ని, రైతుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై లాఠీఛార్జ్‌ చేశారు.

రాష్ట్రపతికి లేఖలు:రాజధాని రైతులు జాతీయ రహదారి దిగ్బంధానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు వారిపై లాఠీ ఝళిపించారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చి, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన రైతులు, మహిళలు దాదాపుగా అసెంబ్లీ వరకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు వారిని అడ్డుకుని లాఠీఛార్జ్‌ చేశారు. తమకు మరణమే శరణ్యం అని కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతికి రాజధాని రైతులు మూకమ్మడిగా లేఖలు రాశారు.

మహిళలదే కీలక పాత్ర:అమరావతి ఉద్యమంలో మహిళలదే కీలక పాత్ర. కొండలు గుట్టలు ఎక్కి.. ముళ్ల పొదలను తొలగించుకుంటూ.. కాల్వలను దాటుకుంటూ లక్ష్యాలను ఛేదించారు. పండగలు, జాతీయ పర్వదినాలు ఇలా ఏ కార్యక్రమమైనా ఉద్యమ శిబిరాలనే వేదికలుగా మలచుకున్నారు. రైతుల ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతుగా నిలిచాయి. ఆయా పార్టీల అగ్రనేతలు రాజధానిలో పర్యటించి రైతులకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారి నుంచి కూడా రాజధాని రైతులకు మద్దతు లభించింది.

న్యాయస్థానం నుంచి దేవస్థానం: సీఆర్డీఏ చట్టం రద్దు, 3రాజధానుల బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 2020 జులై 31న ఆమోదం తెలపడంతో.. రాజధాని రైతులు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు, వివిధ పార్టీలు ఆందోళన ముమ్మరం చేశాయి. ఆ రెండు చట్టాల రద్దుపై హైకోర్టులో సవాల్‌ చేశారు. వాటిపై హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట అమరావతి హైకోర్టు నుంచి తిరుమల వరకూ తొలిదశ మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

రాజధాని రణ నినాదం: రాయలసీమ ముఖద్వారం వద్ద ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోననే తొలుత ఆందోళన చెందినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ ద్వారా రాజధాని రణ నినాదాన్ని తిరుపతి వేదికగా గట్టిగా వినిపించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమరావతి నుంచి అరసవెల్లి వరకూ చేపట్టిన మహాపాదయాత్ర సైతం ఆంక్షలను ఎదుర్కొంటోంది. రైతుల తొలిదశ పాదయాత్ర సమయంలోనే గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర హైకోర్టు కూడా రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పు చెప్పింది.

వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ మూడు రాజధానుల పాటే పాడుతూ.. కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకుండా కాలయాపన చేసింది. సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్​కు వెళ్లింది. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ అంశం జనవరి 31న విచారణకు రానుంది.

ఇవీ చదవండి:రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు.. 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..

బంగాల్​ చాయ్​​వాలా హంగామా.. ఇంటికి అర్జెంటీనా రంగులు.. బయట మెస్సీ విగ్రహం

ABOUT THE AUTHOR

...view details