తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్‌.. తెలంగాణలో టెన్షన్‌ టెన్షన్ - దిల్లీ లిక్కర్ స్కామ్ అప్‌డేట్స్

Delhi Liquor Scam Update : దిల్లీ లిక్కర్ స్కామ్‌ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పేరుకే దిల్లీ కేసు అయినా.. అధికారుల దర్యాప్తుతతో తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. ఇక సీబీఐతో ఈడీ జతకట్టి దర్యాప్తు మరింత ముమ్మరం చేయడంతో పలువురు రాజకీయ నాయకుల్లో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఈ స్కామ్‌లో మూడు, రెండో స్థానాల్లో ఉన్న వ్యాపారులను మాత్రమే టార్గెట్ చేసిన దర్యాప్తు సంస్థలు ఇప్పుడు అసలు తలకాయల పని పడుతున్నాయి.

Delhi Liquor Scam Update
Delhi Liquor Scam Update

By

Published : Nov 11, 2022, 6:56 AM IST

Delhi Liquor Scam Update : దిల్లీ మద్యం కుంభకోణం నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. పేరుకే దిల్లీలో మద్యం కేసు అయినా.. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ దాదాపు తెలుగు రాష్ట్రాల చుట్టూ కేంద్రీకృతం కావడం చర్చనీయాంశమవుతోంది. తాజాగా అరబిందో గ్రూపు డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి అరెస్టుతో ఈ కేసు తెలంగాణలో చర్చనీయాంశమవుతోంది. కుంభకోణంతో సంబంధమున్న మూడో, రెండో స్థానంలో ఉన్న వ్యాపారుల్ని అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థలు.. కీలకమైన తొలిస్థానంలోని ప్రముఖులపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

ఆది నుంచే హైదరాబాద్‌లో ప్రకంపనలు..ఈ కుంభకోణంలో హైదరాబాద్‌ కేంద్రంగా సీబీఐ, ఈడీల దర్యాప్తు ఇంతకుముందే ముమ్మరంగా సాగింది. విడతలవారీగా హైదరాబాద్‌లో సోదాలు, అరెస్టులు జరిగాయి. తొలుత సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లోని నిందితుడు అరుణ్‌ రామచంద్రపిళ్లైకి చెందిన నార్సింగి నివాసంలో రెండు విడతలుగా.. మరో నిందితుడు బోయినపల్లి అభిషేక్‌ ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం గత నెలలో దిల్లీ, పంజాబ్‌తోపాటు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు సమీపంలోని ఆంగ్ల మీడియా సంస్థలోనూ విస్తృతంగా సోదాలు జరిగాయి. అభిషేక్‌ బ్యాంకు ఖాతా నుంచి ఒక మీడియా సంస్థకు చెందిన ముత్తా గౌతమ్‌ ఖాతాకు నగదు బదిలీ జరిగినట్లు గుర్తించిన క్రమంలోనే సోదాలు చేశారు. అభిషేక్‌ అరెస్టు ప్రాధాన్యం సంతరించుకొంది. మరోవైపు గోరంట్ల అసోసియేట్స్‌ సంస్థ కార్యాలయంలో సోదాలు చేసి కీలక సమాచారం సేకరించారు. పలువురు ప్రముఖుల ఆర్థిక లావాదేవీల గుట్టు అక్కడి సమాచారంతోనే రట్టయిందనే ప్రచారం జరిగింది.

సీబీఐకి జత కలిసిన ఈడీ..తొలుత సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్‌ వ్యవహారంపై కూపీ లాగడంలో నిమగ్నమైంది. దిల్లీ మద్యం వ్యాపారి సమీర్‌ మహేంద్రుతోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్‌ ఇన్‌ఛార్జి విజయ్‌నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసి విచారించడంతోనే హైదరాబాద్‌ లింకులు తేటతెల్లమయ్యాయి. ఆ తర్వాతే అభిషేక్‌ కటకటాల పాలు కాగా.. ఇప్పుడు శరత్‌ చంద్రారెడ్డి అరెస్టు చర్చనీయాంశంమైంది.

ABOUT THE AUTHOR

...view details