Delhi Liquor Scam Case: దేశ రాజధానిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలను ప్రైవేటుకు అప్పగిస్తూ.. 2020 సెప్టెంబర్‌లో ఆప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం.. దేశ రాజకీయాల్లోనే తీవ్ర దుమారం రేపింది. 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లాట్‌తో కేజ్రీవాల్ ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసింది. రెండు నెలల తర్వాత ఈ కమిటీ అందజేసిన నివేదిక మేరకు లిక్కర్ పాలసీ తయారు చేయాలని ఆప్ సర్కార్ ఆబ్కారీ శాఖను ఆదేశించింది. ఈ మేరకు కొత్త మద్యం విధానానికి మే 21 2021న దిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే విదేశీ మద్యం ధరలపై కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా ఆరోపణలు చేశారు.
Delhi Liquor Scam Case Updates: ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం పాలసీలో అన్ని అవకతవకలు ఉన్నట్లు గతేడాది జులై 20న కేంద్ర హోంశాఖకు ఆయన లేఖ రాశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 19న 15 మంది పేర్లను చేర్చుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. పలుచోట్ల సోదాలు జరిపింది. మూడ్రోజుల తర్వాత రంగ ప్రవేశం చేసిన ఈడీ.. రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను వెలుగులోకి తేవటంతో పాటు హైదరాబాద్ కేంద్రంగానే ఈ స్కామ్ జరిగినట్లు నిందితులపై మోపిన అభియోగాల్లో ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్‌షీట్‌లో అరుణ్ పిళ్లై పాత్రపై కీలక సమాచారం ఉంది. కవిత తరఫున అరుణ్ పిళ్లై అన్నీ తానై చూసుకున్నారని ఈడీ పేర్కొంది. అరుణ్‌తో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని కవిత పేర్కొనడం జరిగిందని వివరించింది. దక్షిణాది నుంచి రూ.100 కోట్ల ముడుపులు ముట్టజెప్పారని ఈడీ ఆరోపించింది.
దిల్లీలో మద్యం విక్రయాలను ప్రైవేటుకు అప్పగించే క్రమంలో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇందులో భాగంగా దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ.. కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. లైసెన్స్ ఫీజుల్లో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సు పొడిగింపు, ఇతర లైసెన్సుదారులకు కల్పించేలా మద్యం పాలసీని తీసుకువచ్చినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మద్యం కుంభకోణంలో సమీర్ మహేంద్రుతో మొదలు కాగా... ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 11 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారింది.