తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం జగన్‌ లేఖపై దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆగ్రహం - delhi bar association serious over ap cm jagan letter to CJI

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. సీజేఐకి రాసిన లేఖ వివాదాస్పదమవుతోంది. దిల్లీ బార్ అసోసియేషన్.. ఈ లేఖను తప్పుబట్టింది.

delhi-bar-association-serious-over-ap-cm-jagan-letter-to-cji
సీఎం జగన్‌ లేఖపై దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆగ్రహం

By

Published : Oct 15, 2020, 7:36 AM IST

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై నిరాధార ఆరోపణలు గుప్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేకి లేఖ రాయడాన్ని దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. దాన్ని న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకునే అనైతిక ప్రయత్నంగా అభివర్ణించింది. ముఖ్యమంత్రి లేఖ కోర్టు ధిక్కారమేనని అభిప్రాయపడింది. ఇదివరకు దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ ఎన్‌వీరమణ నీతి, నిజాయతీగల ఉత్తమ న్యాయమూర్తి అని.. ఆయనపై ఆరోపణలను ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు ఏకగీవ్ర తీర్మానం చేసింది.

‘‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యవర్గం బుధవారం సమావేశమై చర్చించింది. లేఖ రాయడాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6న ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి ప్రచారంలో పెట్టారు. అందులో జస్టిస్‌ ఎన్‌వీరమణ, హైకోర్టు న్యాయమూర్తుల ప్రవర్తనకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయపరిపాలన వ్యవస్థలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇది స్వతంత్ర న్యాయవ్యవస్థను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు బరితెగించి చేసిన ఈ ప్రయత్నాన్ని దిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండిస్తోంది’’ అని తీర్మానంలో పేర్కొంది.

న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే కుట్ర

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి లేఖ రాయడాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. న్యాయవ్యవస్థకు అపకీర్తిని ఆపాదించి, దాని స్వతంత్రతను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తూ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి చర్యలో పూర్తిగా ఔచిత్యం కొరవడిందని విమర్శించింది. ‘‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి తదుపరి వరుసలో ఉన్న న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి ఈ నెల 6న ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలోని అంశాల పట్ల సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్స్‌ అసోసియేషన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ లేఖను ఈ నెల 10న విలేకర్ల సమావేశం ద్వారా బహిర్గతం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇది ఉన్నత, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు చేయాల్సిన పనికాదు’’ అని పేర్కొంది.

జగన్‌ను పదవి నుంచి తొలగించాలంటూ పిల్‌

న్యాయవ్యవస్థపై నిరాధారమైన నిందలు మోపి అధికార దుర్వినియోగం ద్వారా వ్యక్తిగత ప్రయోజనాలు పొందడానికి కుట్రపన్నిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని పదవి నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలంటూ జీఎస్‌మణి, ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు బుధవారం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి తదుపరి వరుసలో ఉన్న జస్టిస్‌ ఎన్‌వీరమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు వ్యవహారాలను ప్రభావితం చేస్తున్నారంటూ అభాండాలు వేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన ముఖ్యమంత్రి తర్వాత విలేకర్ల సమావేశం ద్వారా బహిర్గతం చేయడాన్ని పిటిషనర్లు తప్పుబట్టారు. మనీలాండరింగ్‌, అవినీతిలాంటి 30 తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న జగన్‌ వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడానికి తన పదవిని అడ్డుపెట్టుకొని సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిరాధారమైన, రాజకీయప్రేరేపితమైన ఆరోపణలు చేశారన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details