KTR US Investments: పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న మంత్రి కేటీఆర్.. బృందానికి అద్భుత స్పందన లభిస్తోంది. లైఫ్‌సైన్సెస్ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా కెమ్‌వేద కంపెనీకి మంచి పేరుంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు... ఈ అమెరికన్ సంస్థ సేవలందిస్తోంది. తెలంగాణలో 150 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు కెమ్‌వేద తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. 500 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయంది. విస్తరణలో భాగంగా తెలంగాణను ఎంచుకున్నామని, ప్రభుత్వ పాలసీలు, అక్కడ ఉన్న నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని కంపెనీ తెలిపింది.
ఆకర్షణీయ పెట్టుబడులకు గమ్యస్థానం..
హైదరాబాద్ నగరం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్న కెమ్ వేద లైఫ్ సైన్సెస్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో ఫార్మా లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టంలో ఉన్న మానవ వనరులు అవకాశాలను ఉపయోగించుకొని ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుంది అని కేటీఆర్ తెలిపారు.