తెలంగాణ

telangana

ETV Bharat / state

మన ఊరు.. మన బడి.. పనులు మందకొడి..

రాష్ట్రంలో విద్యా సంవత్సరం సగం పూర్తయినా.. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు అరకొరగానే సాగుతున్నాయి. అంచనా వ్యయం రూ.30 లక్షలు దాటిన చోట టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్థులకు తరగతి గదుల కొరత.. తప్పని తిప్పలుగా మారింది.

mana ooru manabadi programme
mana ooru manabadi programme

By

Published : Dec 4, 2022, 10:12 AM IST

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులనూ తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మన ఊరు - మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికే పనులను పూర్తి చేయాలన్న సంకల్పం నెరవేరకపోగా.. వచ్చే ఏడాదికి కూడా సంపూర్ణంగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తక్కువ ఖర్చయ్యే విద్యుత్తు పనులే ఎక్కువ చోట్ల పూర్తవుతున్నాయి. తర్వాత చిన్న మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

శౌచాలయాలు, వంట గదులు, ప్రహరీల నిర్మాణ పనులు ఎక్కువ చోట్ల మొదలేకాలేదు. శిథిలావస్థకు చేరుకున్న తరగతి గదుల స్థానంలో కొత్తవి వస్తాయని, తమ అవస్థలు తీరతాయని ఆశించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు నిరాశ తప్పడం లేదు. ఏ ఒక్క చోటా ఆ పనులు ప్రారంభం కాలేదు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం పనులను ‘ఈనాడు’ పరిశీలించగా.. మందకొడిగా నడుస్తున్నట్లు తేలింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది.

టెండర్లకు ముందుకురాని గుత్తేదార్లు:పనుల అంచనా వ్యయం రూ.30 లక్షల లోపు ఉన్న పాఠశాలల్లో ఎక్కువ చోట్ల ఏదో ఒక పని మాత్రమే మొదలయింది. లేదా ఆ ప్రయత్నాల్లో ఉండటమో కనిపించింది. ఆ పనులను పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్లు లేదా కమిటీ తీర్మానించిన వారికి అప్పగించారు. రూ.30 లక్షలకు మించితే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. అలాంటి పనులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల వరకు ఉన్నాయి. వాటికి టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ముందుకు రావడం లేదు.

కొన్నిచోట్ల మూడు నాలుగు సార్లు పిలిచినా ప్రయోజనం ఉండటం లేదు. ఉదాహరణకు నిర్మల్‌ జిల్లాలో 82 పాఠశాలల పనులకు టెండర్లు పిలిస్తే ఇప్పటివరకు 35 చోట్లే పనులు ఖరారయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో 84 బడులకు ఏడు చోట్లే గుత్తేదార్లు ముందుకువచ్చారు. అటూఇటుగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. పనులు చేపడితే సకాలంలో బిల్లులు ఇస్తారో లేదోనని వారు జంకుతున్నట్లు సమాచారం. నిధుల కొరత లేదని అధికారులు, ప్రభుత్వం చెబుతున్నా నష్టపోతామేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటివరకు ఒక్కో జిల్లాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మాత్రమే నిధులు విడుదలైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ప్రకటించి 18 నెలలు...ప్రారంభించి 9 నెలలు:ప్రభుత్వ బడుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేందుకు కొత్త పథకం తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చిలో బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించింది. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తామని వెల్లడించింది. అయినా 2021-22లో నిధులు కేటాయించలేదు.. పనులు మొదలుపెట్టలేదు. 2022 మార్చి బడ్జెట్‌లో రూ.7,289 కోట్లతో మూడు విడతల్లో అన్ని పాఠశాలల్లో వసతులు కల్పిస్తామని సర్కారు ప్రకటించింది. తొలి విడత పనులకు మార్చి 9న వనపర్తిలో సీఎం శ్రీకారం చుట్టారు. మొత్తానికి గత జూన్‌లో బడుల ప్రారంభం నాటికి పనులు పూర్తి చేస్తారని భావించినా విద్యాసంవత్సరం (2022-23) ముగిసే ఏప్రిల్‌ వరకూ అది నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.

ఇదీ కొన్ని పాఠశాలల్లో దుస్థితి...

* ఇది జనగామ జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల. గదులన్నీ దాదాపు శిథిలావస్థకు చేరాయి. మన ఊరు-మన బడి కింద రూ.1.50 కోట్లతో ఎనిమిది తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. టెండర్లు ఖరారు కాకపోవడంతో పనులు మొదలుకాలేదు. వరండా ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉండటంతో పెంకులను తీసివేశారు. గదుల కొరత కారణంగా కొన్ని తరగతులను చెట్ల కిందే నడుపుతున్నారు. జనగామ స్టేషన్‌రోడ్డులోని ఉన్నత పాఠశాల సైతం ఎంపికైనా పనులు మొదలుకాలేదు. అక్కడ కనీసం వంట గది కూడా లేదు. తరగతి గదులు సరిపోకపోవడంతో అదే ప్రాంగణంలో ఉన్న జూనియర్‌ కళాశాల గదుల్ని వాడుకుంటున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని దళితవాడ ప్రాథమిక పాఠశాలకు రూ.12.50 లక్షలు మంజూరుకాగా విద్యుత్తు పనులు పూర్తయ్యాయి. తాగునీటి సంపు పనులు జరుగుతున్నాయి. ప్రహరీ, మరమ్మతు, మరుగుదొడ్ల పనులు మొదలుకాలేదు. విద్యుత్తు పనులకుగాను రూ.88 వేలు మాత్రమే చెల్లించారు.

* జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల ప్రాథమిక పాఠశాలలో పనులు దాదాపు పూర్తయ్యాయి. విద్యుత్తు తాగునీరు, ఇతర మరమ్మతులతోపాటు ఫ్యాన్లు బిగించే పనులన్నీ పూర్తయ్యాయి. రంగులు వేసే ప్రక్రియ చివరి దశలో ఉంది. మొత్తం రూ.13.61 లక్షలు మంజూరు కాగా ఆమేరకు కొంతమంది గ్రామ యువకులు ముందుకొచ్చి పనులు పూర్తిచేశారు. వారికి ఇప్పటివరకు రూ.6.45 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన నిధుల కోసం వారు ఎదురుచూస్తున్నారు. అదే ప్రాంగణంలోని ఉన్నత పాఠశాలకు రూ.32 లక్షలు మంజూరు కాగా పనులు ఇంకా మొదలుకాలేదు. జనగామ జిల్లాలో 176 పాఠశాలలు ఎంపికకాగా 67 చోట్ల పనులు పూర్తయ్యాయని, మరో 64 చోట్ల పురోగతిలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే 45 బడుల్లో పనులు ప్రారంభమే కాలేదు.

* సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు రూ.1.20 కోట్లు మంజూరయ్యాయి. రెండు తరగతి గదులు, భోజనశాల, ప్రహరీ తదితర పనులు చేయాల్సి ఉండగా...ఇప్పటికీ మొదలుకాలేదు. టెండర్లు ఖరారు కాకపోవడమే కారణం. తాటిపాముల ప్రాథమిక పాఠశాలలో విద్యుత్తు పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఉపాధి హామీ నిధుల కింద వంట గది, ప్రహరీ, శౌచాలయాలను నిర్మించాల్సి ఉండగా ఒకట్రెండు రోజుల కిందే వంట గది పునాదుల పనులు ప్రారంభమయ్యాయి. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి ఉన్నత పాఠశాలలో ఇప్పటికీ ఏ ఒక్క పనీ మొదలుకాలేదు.

ఇదీ కార్యక్రమం...

*లక్ష్యం:26,065 సర్కారు బడుల్లో వసతులు మెరుగుపరచడం

*బడ్జెట్‌:రూ.7,289 కోట్లు

*మొదటి విడతలో వ్యయం: రూ.3,497 కోట్లు

* తొలివిడతలో ఎంపిక చేసిన పాఠశాలలు:9,123
(ప్రతి మండలంలో మూడో వంతు)

పర్యవేక్షణ...

పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ, టీఎస్‌ఈడబ్ల్యూఐడీఎస్‌, మున్సిపాలిటీ, సాగునీటి పారుదల

చేయాల్సిన 12 రకాల పనులు ఇవే...

1.నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2.విద్యుదీకరణ 3.తాగునీరు 4.ఫర్నిచర్‌ (పిల్లలు, ఉపాధ్యాయులకు) 5.రంగులు 6. పెద్ద, చిన్నతరహా మరమ్మతులు 7.గ్రీన్‌ బోర్డులు) 8.ప్రహరీగోడ 9.వంట గది 10.శిథిల భవనాల స్థానంలో నూతన గదులు 11.భోజనశాల (ఉన్నత పాఠశాలల్లో మాత్రమే) 12. డిజిటల్‌ సౌకర్యాలు

ఇదీ పరిస్థితి...

*మొత్తం పాఠశాలలు: 9,123

*కలెక్టర్లు పరిపాలన అనుమతులు ఇచ్చినవి: 8,833 (96.82 శాతం)

* పనులు ప్రారంభం: 7,211 (79 శాతం)

* పనులు పూర్తయినవి: 1200 (13.15%)

ఇవీ చదవండి:పోలీస్ అభ్యర్థులకు.. మెలకువలే విజయానికి సోపానాలు

సాయిబాబా పాదాలు మొక్కుతూ గుండెపోటుతో భక్తుడు మృతి

ABOUT THE AUTHOR

...view details