Delay in GHMC Parking Complexes Works: గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు జిల్లాల పరిధిలో రిజిస్టరైన వాహనాల సంఖ్య 65 లక్షలు దాటింది. వీటికితోడు వేలాది కొత్త వాహనాలు ప్రతిరోజూ రోడ్డెక్కుతున్నాయి. అయితే... ఈ సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తీర్ణం, రహదారుల అభివృద్ధి మాత్రం జరగడం లేదు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కూడళ్లు, పర్యాటక ప్రదేశాలు సహా రద్దీ ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు చోటు కనిపించని పరిస్థితి. ఈ సమస్య పరిష్కారం కోసం ఏడేళ్ల క్రితం నగర వ్యాప్తంగా 40చోట్ల మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే... ఇప్పటివరకు వాటిలో ఒక్కదాని నిర్మాణం కూడా పూర్తి కాలేదు. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో నాలుగేళ్ల క్రితం నాంపల్లిలో మొదలైన కాంప్లెక్సు నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
హైదరాబాద్‌లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణంపై 2015 నుంచి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎంఆర్, ప్రజా ప్రతినిధులు చాలాసార్లు ప్రకటనలు చేశారు. ముందుగా 40 చోట్ల కాంప్లెక్సులు నిర్మించనున్నట్లు చెప్పిన ప్రభుత్వం... తర్వాత వాటి సంఖ్యను 22కు, ఆ తర్వాత 12కు కుదించింది. మధ్యలో స్టాక్ పార్కింగ్ విధానాన్నీ తెరపైకి తెచ్చింది. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులతో కలిసి పీపీపీ పద్ధతిలో పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించాలన్న ప్రతిపాదన తెచ్చారు. అయితే... ఇప్పటివరకు వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెట్రో రైలు స్టేషన్లు, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బస్ డిపోలు, కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల అవసరం ఉంది.