Delay In Double Bedroom Houses Distribution : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జీ+3 విధానంలో 544 ఇళ్లు కట్టారు. నిర్మాణం పూర్తయి మూడున్నర ఏళ్లవుతోంది. అర్హుల ఎంపిక మాత్రం పూర్తికాలేదు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెబుతున్నా తీవ్ర జాప్యం అవుతోంది. పలుచోట్ల ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. కిటికీల అద్దాలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది. ఏడాది మొదలు మూడేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నవారు ఎందరో!
ప్రభుత్వం ఉచితంగా కట్టించి ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇళ్లపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంజూరుచేసినవే తక్కువ కాగా అందులో అసలు మొదలుపెట్టనివి పెద్దసంఖ్యలో ఉన్నాయి. మొదలుపెట్టిన వాటిలోనూ పనులు బాగా ఆలస్యంగా జరుగుతున్నాయి. నిర్మాణం పూర్తయిన వాటిని కూడా చాలాచోట్ల అర్హులకు అప్పగించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లు 1.18 లక్షల్లో 17.7శాతమే లబ్ధిదారులకు అప్పగించారు. 90 శాతానికిపైగా పూర్తయిన వాటికి మిగిలిన కొద్ది పనులూ పూర్తిచేస్తే మొత్తంగా కలిపి 1,66,762 ఇళ్లను పేదలకు పంపిణీ చేసేందుకు అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికీ 97,708 ఇళ్లకు అర్హుల ఎంపిక జరగలేదు.
ముందున్న సిద్దిపేట:పట్టణ విభాగంలో చూస్తే సిరిసిల్లలో అప్పగించిన ఇళ్లు కేవలం ఆరే. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే రంగారెడ్డిలో అత్యల్పంగా 80 మందికే ఇచ్చారు. పట్టణాలు, గ్రామీణం... ఈ రెండు విభాగాల్లోనూ అత్యధికంగా ఇళ్లు అప్పగించడంలో సిద్దిపేట ముందుంది. పట్టణ విభాగంలో 2,547.. గ్రామీణ విభాగంలో 1,853 ఇళ్లను అర్హులకు అప్పగించారు.
గ్రామీణంలో జిల్లాల వారీగా ఇచ్చిన ఇళ్లు:సిద్దిపేట 1,853, ఖమ్మం 1,570, కొత్తగూడెం 1,365, సంగారెడ్డి 1,228, మహబూబాబాద్ 986, కామారెడ్డి 651, జగిత్యాల 593, సిరిసిల్ల 533, వరంగల్ 390, కరీంనగర్ 388, వనపర్తి 383, ములుగు 323, నిర్మల్ 295, హనుమకొండ 224, సూర్యాపేట 222, జనగామ 219, నిజామాబాద్ 207, నల్గొండ 155, మెదక్ 128, రంగారెడ్డి 80.
నగర, పట్టణాల్లో ఇచ్చినవి:సిద్దిపేట 2,547, ఖమ్మం 1,636, మహబూబ్‌నగర్ 741, వనపర్తి 199, జనగామ 195,సూర్యాపేట 192, వరంగల్ 182, జగిత్యాలలో 169, కొత్తగూడెం 80, సంగారెడ్డి 33, మంచిర్యాల 30, సిరిసిల్ల 6.
డబ్బుల వసూలు.. ఫిర్యాదులు.. కేసులు
* ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 20,123 ఇళ్లు మంజూరయితే నిర్మాణం పూర్తయిన వాటి సంఖ్య 7,800. అందులో లబ్ధిదారులకు ఇచ్చినవి రెండు వేలు మాత్రమే. జిల్లా కేంద్రం శివారులోని దివిటిపల్లిలో 1,024 ఇళ్లను నిర్మించారు. గతేడాది జూన్ 22న మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఈ ఇళ్లను ప్రారంభించారు. వంద మందికే ఇళ్ల పట్టాలిచ్చారు. మిగతా ఇళ్లను త్వరలోనే అప్పగిస్తామని ప్రకటించి ఏడాదిన్నర అవుతోంది. ఎంపిక అధికారికంగా చేపట్టలేదు. దరఖాస్తుదారులు ఎక్కువమంది ఉన్నప్పుడు లక్కీడిప్ తీసి ఎంపిక చేయాలి. కానీ, రాజకీయనేతల ఒత్తిడితో ఇప్పటికే ఇక్కడ సుమారు 600 మందికి లోపాయికారీగా కేటాయించారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఎంతమందికి కేటాయించారనే వివరాలను రెవెన్యూ అధికారులు చెప్పట్లేదు. ఇటీవల ఇక్కడ ఇళ్లు ఇప్పిస్తామని పలువురు డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు.