రాష్ట్రంలో జనవరి ఆఖరు నాటికి అనధికార ప్లాట్లు 2.8 లక్షలు ఉండగా జీవో వెలువడిన నాటికి వీటి సంఖ్య 3.3 లక్షల దాకా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అనధికార లేఅవుట్లు 4వేల దాకా ఉంటాయని.. ఇవి 23 వేల ఎకరాల్లో ఉన్నాయని శాఖ ప్రాథమిక అంచనా. అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌లను పురపాలక శాఖ రెండు వారాల క్రితమే నిలిపివేయడంతో ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు అనుగుణంగా వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తున్నట్లు పురపాలకశాఖ ఉన్నతాధికారి తెలిపారు. సొంతంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో పాటు మీసేవా కేంద్రాలు, మున్సిపాలిటీల్లోని వినియోగదారుల సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దరఖాస్తు విధానం, అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు (డాక్యుమెంట్లు), చెల్లించాల్సిన రుసుం లెక్కకట్టడం వంటివాటిపై కసరత్తు జరుగుతోంది.
2015లో 3.5 లక్షలు
2015లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినపుడు రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో 1.75 లక్షల దరఖాస్తులు రాగా.. సుమారు 70 వేల దరఖాస్తులను తిరస్కరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 85 వేలకు పైగా దరఖాస్తులు రాగా.. సుమారు 14 వేల దరఖాస్తులను తిరస్కరించారు. ఇక కార్పొరేషన్లు, పురపాలక సంఘాల్లో సుమారు 93 వేల దరఖాస్తులు వచ్చాయి. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పరిధిలో 28,600 దరఖాస్తులు, ఖమ్మం నగరపాలక సంస్థలో 18500 దరఖాస్తులు వచ్చాయి.