Delay in agricultural loans : వ్యవసాయానికి పెట్టుబడుల అవసరం పెరిగేకొద్దీ సంస్థాగతంగా రుణం తగ్గుతోంది. నాబార్డ్ ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర దార్శనిక పత్రంలో వ్యవసాయరంగానికి రుణాల ప్రాధాన్యాన్ని మరోమారు స్పష్టం చేసింది. రుణాలను ఇవ్వడంలో ప్రధానంగా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి కీలకంగా ఉండే వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాగు రుణాల వార్షిక ప్రణాళికలో 77% లక్ష్యం చేరుకున్నట్లు పేర్కొంది. రుణాలను అందించడంలో గ్రామీణ, సహకార బ్యాంకులు లక్ష్యాలను చేరుకుంటున్నా జాతీయ బ్యాంకులు అందుకోవడం లేదని విశ్లేషించింది. గ్రామీణ బ్యాంకులు లక్ష్యం కంటే ఎక్కువగా ఇస్తుండగా సహకార బ్యాంకులు లక్ష్యంలో 96 శాతం చేరినట్లు తెలిపింది. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యధికం చిన్న, సన్నకారు రైతులే ఉండగా ప్రధానంగా వరి, పత్తి పంటపైనే వారు ఆధారపడుతున్నట్లు పేర్కొంది. గత ఏడాది వ్యవసాయ రుణ ప్రణాళికను 14.16శాతం పెంచింది. బ్యాంకు రుణాల్లో పంట రుణాలు అత్యంత కీలకమని పేర్కొంటూ ఈ లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
ఖరీఫ్ రుణాల్లో తీవ్ర జాప్యం