యాజమాన్య కోటాలో డీఈడీ స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరి రెండేళ్లు విద్యనభ్యసించిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గురువారం నిర్వహించే అకడమిక్ పరీక్షలకు వారిని అనుమతించకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. తమను పరీక్షలకు అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద విద్యార్థులు నిరాహార దీక్షలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు ఆందోళన చేస్తూ స్పృహ తప్పి పడిపోయారు.
అప్రమత్తమైన తోటి విద్యార్థులు 108 ద్వారా జీజీహెచ్‌కు తరలించారు. రెండేళ్లు చదివిన తర్వాత ఇప్పుడు పరీక్షలకు అనుమతివ్వకపోతే తమ పిల్లల పరిస్థితేంటని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. యాజమాన్యాలు చేసిన పొరపాటుకు విద్యార్థులను ఇబ్బందిపెట్టడం సమంజసం కాదన్నారు. 2015, 2016, 2017 సంవత్సరాల్లో స్పాట్ అడ్మిషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారన్నారు.