Decreasing Paddy Cultivation: రాష్ట్రంలో వ్యవసాయ ముఖచిత్రం మారిపోతోంది. ప్రభుత్వం వడ్లు కొనబోమని తేల్చి చెప్పడంతో... అధిక శాతం రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లుతున్నారు. ఈ యాసంగి సీజన్‌లో వరికి బదులు ఆరుతడి పంటల సాగువిస్తీర్ణం పెరుగుతుంది. యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 45.49 లక్షల ఎకరాలుగా వ్యవసాయశాఖ ప్రతిపాదించగా... ఇప్పటివరకు 12.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు పండిస్తున్నారు.
విస్తీర్ణం తగ్గే సూచనలు...
వరి 31 లక్షల ఎకరాలు నిర్దేశించగా... మారిన పరిణామాల కారణంగా ఇప్పటివరకు 1.18 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది యాసంగిలో ఇదే సమయానికి 3.07 లక్షల ఎకరాల విస్తీర్ణంలో నాట్లు పడ్డాయని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇంకా సమయం ఉన్నందున వరి సాగు విస్తీర్ణం తగ్గే సూచనలున్నాయని పేర్కొన్నారు.