ఐఐటీలతో పాటు ఐఐఎం, ఇతర కేంద్రీయ విద్యాసంస్థల్లో అర్ధంతరంగా చదువు మానేస్తున్న వారి(డ్రాపౌట్) శాతం తగ్గుతోంది. అయిదేళ్ల క్రితంతో పోల్చుకుంటే ఈ విద్యా సంవత్సరం ఇలా మధ్యలో మానేసిన వారి శాతం సగానికి పైగా తగ్గిందని కేంద్ర మానవ వనరుల శాఖ తాజాగా వెల్లడించింది. ఐఐటీ, ఐఐఎంలలో సీట్లు పొందిన ప్రతిభావంతులు సైతం చదువు పూర్తిచేయలేక ఒత్తిడితో అర్ధంతరంగా చదువు మానేస్తున్నారు. అయితే గత అయిదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే డ్రాపౌట్ అవుతున్న వారి శాతం గణనీయంగా తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది.
ఎందుకు మానేస్తున్నారు..?
ఐఐటీల్లో బీటెక్, ఎంటెక్, ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ విద్యార్థులుంటారు. వాటిల్లో డ్రాపౌట్ అయ్యే వారిలో అధిక శాతం మంది ఎంటెక్ విద్యార్థులే. కొందరు చదువు పూర్తిచెయ్యలేక లేదా అనారోగ్యం వల్ల మానుకుంటుండగా, అధిక శాతం మంది మధ్యలో ఉద్యోగాలు వచ్చి వదిలేస్తున్నారు. వాటిల్లో 2014-15లో 1126 మంది డ్రాపౌట్లు ఉండగా బీటెక్ వారు కేవలం 63 మందే. అత్యధిక శాతం ఎంటెక్ విద్యార్థులు ఉండటంతో వారి వార్షిక రుసుమును బీటెక్‌తో సమానంగా రూ.2లక్షలకు పెంచాలని, దానివల్ల వారు చదువు మానుకోకుండా ఉంటారని గత ఏడాది ఆగస్టులో జరిగిన ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. గత రెండేళ్ల( 2017-18, 2018-19)లో 23 ఐఐటీల్లో 2,461 మంది మధ్యలో చదువును వదిలేసి వెళ్లగా వారిలో 1,171 మంది ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులు(48.2 శాతం). మిగిలినవారు అన్ రిజర్వుడ్ విద్యార్ధులు. ఐఐఎంల్లో 62.60 శాతం రిజర్వుడ్ కేటగిరీ వారు.