తెలంగాణ

telangana

ETV Bharat / state

నష్టాల సాగు: పత్తి రైతు కన్నీటి గోస.. మద్దతు కోసం ప్రయాస - హైదరాబాద్​ వార్తలు

పత్తి కొనుగోళ్ల ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఆశించిన స్థాయిలో సరకు మార్కెట్‌కు రావడం లేదు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. పింక్‌ బోల్‌వార్మ్​తో మిగిలిన కాస్త పంట దెబ్బతినడం వల్ల దిగుబడి తగ్గింది. గత ఏడాది వానా కాలం సీజన్‌లో 60 లక్షల పత్తి బేళ్లు మార్కెట్‌కు వస్తే.. ఈసారి 30 లక్షల బేళ్లకు మించి వచ్చే పరిస్థితి లేదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

decreased-cotton-yield-in-telangana-due-to-the-rains-and-pests
పత్తి రైతు కన్నీటి గోస.. మద్దతు కోసం ప్రయాస

By

Published : Nov 19, 2020, 3:52 PM IST

రాష్ట్రంలో తెల్ల బంగారం రైతులను నిండా ముంచేసింది. పంట పూత దశ నుంచి మొదలైన వానలు పిందె, పూత, కాయ దశల్లోనూ ఆగకపోవటంతో దిగుబడులు పడిపోవడం వల్ల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఒక ఎకరం విస్తీర్ణంలో 12 నుంచి 16 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని ఆశపడిన రైతులకు 3 నుంచి 6 క్వింటాళ్ల వరకే పత్తి పరిమితమైంది. ఆ వచ్చిన కొద్దిపాటి పంటైనా అమ్ముకుందామంటే... కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల మద్దతు ధర కంటే తక్కువకే.. రూ. 3,500 నుంచి 4 వేలకు దళారులకు అమ్మేశారు.

62 లక్షల ఎకరాల్లో సాగు

320 జిన్నింగ్ మిల్లులు, 109 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో సీసీఐ కొనుగోళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు సగం కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. మిగతావి నెలాఖరులోగా తెరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది వానా కాలంలో నిర్దేశిత పంట సాగు విధానం కింద పత్తి పంట 62 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైంది. తొలుత అంచనాల ప్రకారం... 70 లక్షల పైగా బేళ్ల పత్తి దిగుబడులు వస్తాయని వ్యవసాయ అంచనా వేసింది.

క్వింటాకు రూ.5,515 నుంచి రూ.5,825

కానీ భారీ వర్షాలతో పత్తి పంట గణనీయంగా దెబ్బతింది. పంట 50 నుంచి 60 శాతం దెబ్బతింది. అదే సమయంలో తెగుళ్లు, చీడపీడలు... ప్రత్యేకించి పింక్ బోల్‌వార్మ్ మరింత దెబ్బతీయడం వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే 30 లక్షల పత్తి బేళ్లు రావచ్చని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు, సీసీఐ విశ్లేషిస్తోంది. రైతులు రెండో విడత ఏరిన పత్తి సీసీఐ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. మధ్య రకం పింజ ఉన్న పత్తికి క్వింటాకు ధర రూ.5,515, పొడుగు రకం పింజ ఉన్న పత్తి క్వింటాలకు ధర 5,825 రూపాయలు చొప్పున కేంద్రం కనీస మద్దతు ధర నిర్ణయించింది.

రైతులకు తప్పని తిప్పలు

సీసీఐ నిబంధనల మేరకు 8 శాతం మించి తేమ ఉంటే క్వింటాకు రూ.58.25 కోత విధిస్తారు. 8 శాతంలోపు తేమ ఉంటే క్వింటాకు రూ. 58.25 బోనస్ ఇస్తారు. పత్తి పంట వచ్చిన రెండు మాసాల వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దసరా పండుగ ముందు ఏర్పాటు చేసినా... తేమ, రంగు వంటి నాణ్యత పేరిట రైతులకు తిప్పలు తప్పలేదు. కొనుగోలు కేంద్రాలకు పత్తి అమ్ముకోవడానికి వచ్చే రైతులకు మద్దతు ధర లభించకపోవటంతో.. పెట్టిన పెట్టుబడి, శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని అన్నదాతలు వాపోతున్నారు. నాణ్యమైన తెల్ల బంగారం రాకపోవడం వల్ల పరిశ్రమ నిర్వహణ గగనంగా మారిందని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:దేశంలోనే సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్​ను తీర్చిదిద్దాం: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details