తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల నియంత్రణ చర్యలతో 24 జిల్లాల్లో తగ్గిన ఉద్ధృతి - అధికారుల నియంత్రణ చర్యలతో 24 జిల్లాల్లో తగ్గిన ఉద్ధృతి

రాష్ట్రంలోని 28 జిల్లాలో వైరస్ జాడలు కనిపించినా.. అధికారుల నియంత్రణ చర్యలతో 24 జిల్లాల్లో దాదాపుగా ఉద్ధృతి తగ్గింది. అక్కడక్కడా ఒకటి రెండు కేసులు నమోదవుతున్నా.. హైదరాబాద్ మహానగరం పరిధిలో సూర్యాపేట, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం ఇంకా విజృంభణ కొనసాగుతోంది.

అధికారుల నియంత్రణ చర్యలతో 24 జిల్లాల్లో తగ్గిన ఉద్ధృతి
అధికారుల నియంత్రణ చర్యలతో 24 జిల్లాల్లో తగ్గిన ఉద్ధృతి

By

Published : Apr 18, 2020, 5:01 AM IST

జీహెచ్​ఎంసీ పరిధిలో గత ఐదు రోజుల్లో 143 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో గత ఆరు రోజుల్లో 45 మందికి కరోనా సోకగా... వికారాబాద్‌లో నాలుగు రోజుల్లో 20, నిజామాబాద్‌లో గత 11 రోజుల్లో 38 చొప్పున కేసులు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల పరిధిలో కేసులు విపరీతంగా పెరుగుతుండటం వల్ల సర్కారు.. నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టింది. లాక్‌డౌన్ గడువు మరో 16 రోజులు ఉన్నందున ఈలోగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారుల నేతృత్వంలో కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో యంత్రాంగం పకడ్బంది చర్యలకు ఉపక్రమించింది.

శుక్రవారం నాటికి జీహెచ్​ఎంసీ పరిధిలో 417 కరోనా కేసులు నమోదవడం వల్ల ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే హైదరాబాద్‌ మహానగర పరిధిలో 30 క్లస్టర్లలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేక బృందాన్ని నియమించింది. డిప్యూటీ డీఎంహెచ్​వో స్థాయి అధికారికి డీఎంహెచ్ఓ స్థాయి అధికారాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఎక్కడికక్కడ కట్టడి చర్యలను మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 146 కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించింది.

సూర్యాపేట జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54కు చేరుకుంది. ఇక్కడ వైరస్ అతివేగంగా వ్యాప్తి చెందుతున్నందున యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా లక్షణాలు లేకుండా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తుండటం వల్ల ఆ దిశగా లోతుగా పరిశీలిస్తోంది. ప్రధానంగా కూరగాయల మార్కెట్ ప్రాంతం నుంచే 42 మంది వైరస్ బాధితులున్నందున ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ పాజిటివ్ వ్యక్తులతో సన్నిహితంగా మరో 100 మంది ఉన్నట్లు గుర్తించారు. జనసంచారాన్ని పూర్తిగా నియంత్రించారు. గత 10 రోజుల్లో వైరస్ బాధితులు ఎక్కడెక్కడ తిరిగారనే సమాచారాన్ని వారి చరవాణి సహాయంతో సేకరించి, పరీక్షలు నిర్వహించడంపై దృష్టిపెట్టారు.

వికారాబాద్ జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ప్రయాణికులు... వారి సన్నిహితులవే. తొలుత ఇద్దరిలో పాజిటివ్ రాగా.. వారి నుంచి సమాచార సేకరణలో ప్రతికూలత ఎదురైంది. అయినా యంత్రాంగం కూపీ లాగడం వల్ల ఎవరెవరిని కలిశారనే సమాచారమంతా బయటపడింది. ఈ వివరాల ఆధారంగా మొత్తంగా ఇప్పటి వరకు 611 మంది అనుమానితుల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. స్థానిక రిక్షా కాలనీలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉండడం వల్ల యంత్రాంగం ఇక్కడ నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.

నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 58 కేసులు నమోదయ్యాయి. 20 క్వారంటైన్ కేంద్రాలను నెలకొల్పి, 500 మందిని తరలించారు. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వేను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. రెడ్‌ జోన్లుగా గుర్తించిన కాలనీలకు ఎవరూ వెళ్ళకుండా.. అక్కడి వారు బయటకు రాకుండా రోడ్లకు అడ్డంగా వెదురుబొంగులు పెట్టి పూర్తిగా మూసివేశారు.

ఇదీ చూడండి:సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

ABOUT THE AUTHOR

...view details