వృత్తి జీవితం, ఆంగ్లం సహా పరభాషలపై మోజుతో.... మాతృభాషను మరవొద్దంటూ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరపాలక సంస్థ చేసిన ప్రయత్నం ఆలోచింపజేస్తోంది. సుంకేసుల రోడ్డులోని చిల్డ్రన్స్ పార్క్ సర్కిల్ నుంచి మదర్ థెరిసా కూడలి వరకు తెలుగు వర్ణమాల, తెలుగు అంకెలను రోడ్డు మధ్యలో అందంగా ఆవిష్కరించారు. రహదారికి ఇరువైపులా సుందరంగా ఏర్పాటు చేసిన ఈ అక్షరమాల విశేషంగా ఆకట్టుకుంటోంది..
ఆర్టీసీ బస్సుపై తెలుగు అంకెలను చూసిన నగరపాలక సంస్థ కమిషనర్ బాలాజీకి... మాతృభాషను అందరూ గుర్తుంచుకునేలా ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. అంకెలతో పాటు తెలుగు అక్షరాలనూ గుర్తుచేయాల్సిన అవసరం ఉందనుకుని ఈ ప్రయత్నం చేశారు. వాహనదారులు చూసినపుడు... అక్షరాలన్నీ వరుస క్రమంలో కనిపించేలా ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ ప్రయత్నాన్ని స్థానికులు మెచ్చుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని కోరుతున్నారు.