రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 48 గంటల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తామే తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం అన్నివిధాలుగా పర్యవేక్షిస్తోందని అడ్వొకేట్ జనరల్ ఉన్నత న్యాయస్థానానికి వివరించగా.. పర్యవేక్షణ కాదు, చర్యలు ఉండాలని స్పష్టం చేసింది.
అత్యవసర బృందాలు ఏర్పాటు చేశారా..?
కరోనాపై ప్రజలకు అన్నీ తెలిసిపోయాయని.. ప్రభుత్వానికే తెలియాలని వ్యాఖ్యానించింది. రద్దీ నియంత్రణపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని.. ఎన్నికల ర్యాలీలు, వివాహాలు, అంత్యక్రియల విషయంలో చర్యలేంటని ప్రశ్నించింది. ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం నింపలేకపోతోందన్న హైకోర్టు.. వార్డుల వారీగా అత్యవసర బృందాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారా? అని వివరణ కోరింది.
మరింత గడువు కావాలి: ఏజీ
కుటుంబమంతా కరోనా బారినపడితే ఏవిధంగా సాయం చేస్తున్నారన్న హైకోర్టు.. ఈనెల 22లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు రోజులు సరిపోవు.. మరింత సమయం కావాలని ఏజీ కోరగా.. మూడు రోజుల్లో మీరు చేయగలిగింది చేయండి.. మిగతాది తాము తాము చేస్తామని తెలిపింది. అనంతరం విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:'పబ్లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాదా'