Deccan Mall Fire Accident Latest Updates: సికింద్రాబాద్ దక్కన్ మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన అనంతరం దట్టమైన పొగలు రావడంతో తమకు, తమ పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చాయని స్థానికులు వాపోయారు. ప్రస్తుతం అక్కడ దక్కన్ మాల్ భవనాన్ని కూల్చే ప్రక్రియ కొనసాగుతుండటంతో చుట్టు పక్కల ఇళ్లల్లో ఉండే స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 12 రోజులుగా అక్కడ ఉంటూ సరైన నిద్రాహారాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు.
తమ జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది:అగ్నిప్రమాద తీవ్రత వల్ల తమ ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. గోడలు బీటలు వారడంతో సామాగ్రికి కూడా కొంతమేర నష్టం జరిగినట్లు స్పష్టం చేశారు. అధికారులు వెంటనే కూల్చివేత పనులు పూర్తి చేసి.. తమ ఇళ్లలోకి పంపించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, దాతలు కొంతమేరకు ఆదుకున్నప్పటికీ తమ జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి:రోజువారి పనులు చేసుకుంటూ బతికే తమకు 12 రోజులుగా పునారావాస కేంద్రాల్లో ఉండటంతో.. ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యాపారస్తులు సైతం అగ్నిప్రమాదం జరిగినప్పటి నుంచి తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దక్కన్ మాల్ కూల్చివేత పనులు త్వరగా పూర్తిచేసి తమను ఇళ్లలోకి పంపించాలని.. అలాగే నష్టపోయిన స్థానికులను, వ్యాపారులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.
"దక్కన్ మాల్ ప్రమాదం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలను వేరే వాళ్ల ఇంటికి పంపిచాం. మేము ఇండ్లను చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. మా ఇండ్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. 12రోజులుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. చేసేందుకు పని లేక ఇబ్బందులు పడుతున్నాం. ఫలితంగా ఉపాధి దెబ్బతింది." - అనిత, స్థానికురాలు