DDS Founder PV Satish Passed Away: దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు పీవీ సతీశ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. 1945 జూన్ 18న ఆయన కర్ణాటకలో జన్మించారు. పూర్తి పేరు పెరియపట్నం వెంకటసుబ్బయ్య సతీశ్. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పని చేశారు.
అనంతరం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ స్థాపించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా.. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించారు. ప్రత్యేకించి చిన్న, చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా.. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంపు కోసం కృషి చేశారు.
సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి: జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీశ్ కుమార్ విశేషంగా కృషి చేశారు. 30 సంవత్సరాల కిందట మొదటిసారిగా ప్రపంచవ్యాప్త చర్చలో.. చిరుధాన్యాలను ప్రవేశపెట్టడంలో సఫలీకృతమయ్యారు.సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేశారు. మహిళా స్వాలంభన, పేద దళితుల ఆర్థిక అభివృద్ధికి, విద్యా నైపుణ్యాభివృద్ధికి డీడీఎస్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంలో.. 2018 సంవత్సరాన్ని కేంద్రం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరి కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.
ఈ నేపథ్యంలో పీవీ సతీశ్ మృతి జహీరాబాద్ ప్రాంతానికి తీరని లోటని చెప్పవచ్చు. కమ్యూనిటీ గ్రెయిన్ ఫండ్ అని పిలవబడే ప్రత్యామ్నాయ డీడీఎస్‌ను స్థాపించడంలో ఆయన కృషి ఎంతో ఉంది. స్థానిక పాత ఆహార వ్యవస్థలను పునరుద్ధరించడం.. కీలకమైన విత్తన వ్యవస్థల బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారు. హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్ ఏర్పాటుకు చొరవ చూపారు. ఆయన పార్థివదేహాన్ని జహీరాబాద్‌లోని డీడీఎస్ ప్రధాన కార్యాలయానికి తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.