జంటనగరాల పరిధిలోని దేవాదాయ భూముల పరిరక్షణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్న ఇంద్రకరణ్ రెడ్డి... ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిరుపయోగంగా ఉన్న ఆలయ భూములను గుర్తించి, వాటి ద్వారా ఆదాయం పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
లీజుల విషయంలో కఠినం
దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. నామమాత్రపు ధరకు దేవాదాయ శాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకుని.. తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లీజ్ నిబంధనలు మార్చి దేవాదాయ శాఖకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని చెప్పారు. దశాబ్దాల క్రితం నాటి లీజ్లతో పాటు అద్దెల విషయంలో కూడా పునఃసమీక్ష చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.