తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్‌ అనుమతి

By

Published : Jan 3, 2021, 8:33 PM IST

Updated : Jan 4, 2021, 7:09 AM IST

కొవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్‌ అనుమతి
కొవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్‌ అనుమతి

20:29 January 03

కొవాగ్జిన్​ టీకా తయారీకి భారత్‌ బయోటెక్‌కు లైసెన్సింగ్ అనుమతి

కొవాగ్జిన్​ టీకా తయారీకి భారత్‌ బయోటెక్‌కు లైసెన్సింగ్ అనుమతి

   హైదరాబాద్‌ నగరానికి చెందిన దిగ్గజ ఔషధ సంస్థ భారత్‌ బయోటెక్‌కు ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) లైసెన్సింగ్‌ అనుమతి మంజూరు చేసింది. కొవాగ్జిన్‌ టీకా తయారీ కోసం భారత్‌ బయోటెక్‌కు ఈ లైసెన్సింగ్‌ అనుమతిని డీసీజీఐ జారీ చేసింది. కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం తెలపడం పట్ల భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. డీసీజీఐ అనుమతివ్వడం.. దేశం గర్వించదగ్గ విషయమన్నారు. భారత శాస్త్రీయ సామర్థ్యానికి ఈ అనుమతి తార్కాణమని అభివర్ణించారు. దేశ పర్యావరణహిత ఆవిష్కరణల పథంలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. వివిధ రకాల వైరల్‌ ప్రొటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్‌ రూపొందించినట్లు కృష్ణ ఎల్ల చెప్పారు. కొవాగ్జిన్‌ బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలను ఉత్పత్తి చేస్తుందన్నారు. డీసీజీఐ అనుమతి కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉందని కృష్ణ ఎల్ల సంతోషం వ్యక్తం చేశారు.

   కొవిడ్‌-19 నిర్మూలనకు భారత్‌ బయోటెక్‌ రూపొందించిన స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు నిపుణుల కమిటీ శనివారం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అనంతరం కొవాగ్జిన్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని డీసీజీఐకు నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న డీసీజీఐ.. తాజాగా కొవాగ్జిన్‌ తయారీకి లైసెన్సింగ్‌ అనుమతి జారీ చేసింది.

  భారత్​ బయోటెక్ టీకాను 2-8 డిగ్రీల సెల్సియస్​ సాధారణ ఉష్ణోగ్రతలో నిల్వ చేయవచ్చు. ఒక్కొక్కరికి రెండు డోసుల్లో టీకాను ఇవ్వాల్సి ఉంటుంది. కొవాగ్జిన్​ టీకాను హైదరాబాద్​కు చెందిన భారత్​ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్​తో కలిసి తయారు చేసింది. కొవాగ్జిన్​ మూడో దశ ప్రయోగాలు గతేడాది నవంబర్‌లో ప్రారంభించారు. మూడో దశ ప్రయోగాల కోసం 23వేల మంది వాలంటీర్లను తీసుకున్నారు.

ఇదీ చదవండి: కొవాగ్జిన్ టీకాను అన్నిదేశాలకు అందిస్తాం: భారత్‌ బయోటెక్‌

Last Updated : Jan 4, 2021, 7:09 AM IST

ABOUT THE AUTHOR

...view details