Daughter Performed Last Rites: కాసులిస్తేనే తలకొరివి పెడతానన్న కుమారుడి దాష్టీకంతో కన్న కూతురే తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండటం గుమ్మడిదుర్రులో చోటుచేసుకుంది. ఆరేళ్లుగా కుమర్తె వద్దే తలదాచుకుంటున్న ఆ వృద్ద దంపతులపై కుమారుడు కనికరం చూపకపోవటంతో కూతురే కొడుకై అంత్యక్రియలు చేసింది. అనిగండ్లపాడు గ్రామానికి చెందిన గింజుపల్లి కోటయ్య (80)కు కుమారుడితో తరచూ గొడవల కారణంగా గత కొంతకాలంగా గుమ్మడిదుర్రులోని కుమార్తె వద్ద ఉంటున్నారు.
అనారోగ్యానికి గురైన కోటయ్య శుక్రవారం మృతి చెందాడు. తండ్రి మృతి విషయాన్ని కుటుంబసభ్యులు కుమారుడికి చెప్పినా.. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయి ఖర్మ చేసేందుకు అతడు నిరాకరించాడు. తండ్రి వద్ద ఉన్న డబ్బు ఇస్తేనే ఖర్మ చేస్తానని భీష్మించుకు కూర్చున్నాడు. కనీసం చూసేందుకు కూడా రాకపోవటంతో చేసేది లేక కుమార్తె విజయలక్ష్మి ఖర్మ చేసేందుకు ముందుకు వచ్చింది. బంధువుల సహకారంతో ఆమె తండ్రికి అన్నీ తానై తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది.
గతంలో కోటయ్యకు ఉన్న భూమిని విక్రయించగా రూ.కోటి వచ్చాయి. అందులో రూ.30 లక్షలు తన వద్ద ఉంచుకొని మిగిలిన సొమ్మును కుమారుడికి ఇచ్చాడు. ఆ సొమ్మును కూడా ఇవ్వాలని కుమారుడు తండ్రితో తరచూ గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కోటయ్య, అతని భార్య గత కొంతకాలంగా కుమార్తె వద్ద ఉంటున్నారు. వారి బాగోగులు కూతురు విజయలక్ష్మి చూస్తోంది.