కరోనా మహమ్మారి కారణంగా విద్య, వైద్యం, పని సంప్రదాయాలు అన్నీ మారిపోయాయి. వైరస్ విజృంభణతో చదువు ఆన్లైన్ అయిపోయింది. పని.. వర్క్ ఫ్రం హోంకు మారింది. సమావేశాలు, చర్చలు వర్చువల్‌గా జరుగుతున్నాయి. వినోదం సైతం ఓటీటీలు, యూట్యూబ్ ఛానళ్ల స్ట్రీమింగ్ అవుతోంది. వీటన్నింటి కారణంగా గతేడాది కాలంగా డేటా వాడకం(data demand) నాలుగింతలు పెరిగినట్లు ట్రాయ్(TRAI) తెలిపింది. డేటా వినియోగదారులతో పాటు.. రోజువారీ సగటు డేటా వినియోగం సైతం 14 జీబీ నుంచి 30 జీబీలు దాటుతున్నట్లు ట్రాయ్ పేర్కొంది. దీంతో కొవిడ్ మహమ్మారి కారణంగా నెట్టింట్లో ట్రాఫిక్ అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న డేటా వినియోగానికి అనుగుణంగా కంపెనీలు సైతం ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాయి.
పోటాపోటీగా
ఈ డిమాండ్‌తో మార్కెట్లో మెజారిటీ వాటా చేజిక్కించుకునేందుకు టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. ఏడాది కాలంలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వినియోగదారుల సంఖ్య 27 శాతం పెరిగిందంటే డిమాండ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో 2021 సంవత్సరానికి గాను ఆ కంపెనీ 30 లక్షల కస్టమర్ మార్కును చేరుకుంది. గతేడాది విధించిన లాక్డౌన్ సమయంలోనే కొత్తగా 20 లక్షల మంది జియో ఫైబర్ వినియోగదారులు చేరారని.. బోర్డు ఏజీఎం మీట్లో కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. డేటా వినియోగం సైతం గతేడాదితో పోలిస్తే.. 3.5 రెట్లు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు, యాక్ట్ ఫైబర్ నెట్, ఎక్సైటెల్ వంటి సంస్థలు వాటి మార్కెట్ వాటాను మరింత పెంచుకున్నాయి. గతేడాది కాలంలో తమ కంపెనీకి 65 శాతం కొత్త కనెక్షన్లు వచ్చినట్లు ఎక్సైటెల్ కంపెనీ ప్రకటించింది. అయితే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లలో ఈ వృద్ధి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో చాలా తక్కువే అయినా.. ఆ దిశగా మన దేశం వడివడిగా అడుగులేస్తోంది. జపాన్‌లో ఇది 50 శాతంగా, చైనాలో 14 శాతంగా, అమెరికాలో 30 శాతం ప్రజలు డేటా వినియోగంలో ఉన్నారు.