Dalithabandhu: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు సర్కార్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి దతత్తగ్రామం వాసాలమర్రి, హజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్ పద్ధతిన పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. మరో నాలుగు మండలాల్లోనూ పైలట్ పద్ధతిన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాలు ఇందులో ఉన్నాయి. హుజూరాబాద్‌లో పూర్తి స్థాయిలో దళితబంధు అమలవుతున్న తరుణంలో రాష్ట్రంలోని మిగతా 118 నియోజకవర్గాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వంద మంది లబ్దిదారుల చొప్పున పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు.
118 నియోజకవర్గాల్లో..
ఆ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. దళితబంధు అమలుకు సంబంధించి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 118 శాసనసభ నియోజకవర్గాల్లో పథకం అమలు కోసం ప్రతి నియోజకవర్గంలో కుటుంబం యూనిట్‌గా వందమంది లబ్దిదారులను ఎంపిక చేయాలని తెలిపారు. మార్చి నెలలోగా ఆయా నియోజకవర్గాల్లో వంద కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని చెప్పారు. ఇందుకోసం స్థానిక శాసనసభ్యుల సలహాతో లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇంఛార్జి మంత్రులతో ఆమోదించుకోవాలని తెలిపారు.