తెలంగాణ

telangana

ETV Bharat / state

Dalita Bandu: ఈనెల 16 నుంచి హుజూరాబాద్​లో దళితబంధు అమలు - Dalitbandhu implementation in Huzurabad

ఈనెల 16 నుంచి దళితబంధు పథకం హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. దళితుల్లో పేదరికం రూపుమాపే లక్ష్యంతో ప్రవేశపెడుతున్న దళితబంధుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం ఆ పథకానికి చట్టభద్రత కల్పిస్తూ... ప్రత్యేక చట్టం తేవాలని అభిప్రాయపడింది. లబ్ధిదారులు సమూహంగా ఏర్పడి ఎక్కువ మొత్తంలో పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. మిగతా గ్రామంతో సమానంగా అన్ని హంగులు ఉండేలా దళితవాడల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Dalitbandhu
హుజూరాబాద్​లో దళితబంధు

By

Published : Aug 2, 2021, 5:17 AM IST

దళితబంధు (Dalita Bandu) పథకం అమలు, విధి విధానాల రూపకల్పనపై రాష్ట్ర మంత్రివర్గం సుధీర్ఘంగా చర్చించింది. పథకం పూర్వాపరాలను సమావేశంలో వివరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr) అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకుసాగుతోందని... ఆ ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. దళితజాతి రూపురేఖలు మార్చేలక్ష్యంతో దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్న కేసీఆర్... రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో... దళితులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దయనీయ స్థితిలో...

రాష్ట్రంలో 20 శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో... కేవలం 13 లక్షల ఎకరాల సాగుభూమి మాత్రమే ఉందని... వారి పేదరికానికి ఇంతకుమించిన గీటురాయి లేదని స్పష్టంచేశారు. ఆ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని సీఎం పేర్కొన్నారు. అరకొర సాయంతో దళితుల అభివృద్ధి సాధ్యం కాదన్న కేసీఆర్... దళితబంధులో ఒక యూనిట్ పెట్టుకోవడానికి పది లక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. బ్యాంకులతో అనుసంధానం పెట్టుకోలేదని... తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆదాయం, ఆర్థికస్థితిలో మెరుగుదల రాదని అభిప్రాయపడ్డారు.

ఉపాధి, వ్యాపార మార్గాలను ఎంచుకునే స్వేచ్చ లబ్ధిదారులదేనన్న సీఎం... ప్రభుత్వం, అధికారులు, దళిత బంధు స్వచ్ఛంద కార్యకర్తలు వారికి మార్గదర్శనం చేస్తారని... అవగాహన కల్పిస్తారని వివరించారు. పథకం అమల్లో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు... ప్రతిజిల్లాలో సెంటర్ ఫర్ దళిత్ ఎంటర్‌ప్రైజ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రత్యేక చట్టం...

తెలంగాణ దళితబంధు పథకాన్ని ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం... పథకానికి చట్టభద్రత కల్పిస్తూ ప్రత్యేకచట్టం తేవాలని అభిప్రాయపడింది. ఎస్సీ ప్రగతి నిధి చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచిందని... అదే తరహాలో దళితబంధు దేశానికి దారిచూపే పథకం అవుతుందని మంత్రివర్గం వ్యాఖ్యానించింది. ఈనెల 16 నుంచి దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా... హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం సిద్దం కావాలని కేబినెట్ ఆదేశించింది.

సీఎం నిర్ణయానికి ఆమోదం...

లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి... ఎక్కువ మొత్తం పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదం తెలిపింది. లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ, అవగాహన కల్పించాలని అందుకోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ శాఖల అధికారులు, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యూనిట్ పెట్టగానే ప్రభుత్వ బాధ్యత తీరిపోదని అది సరిగ్గా నడుస్తుందా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యమని అభిప్రాయపడింది.

ప్రత్యేక కార్డు...

దళితబంధు అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని ఇందుకోసం వివిధ శాఖల్లో అదనపు ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును మంత్రివర్గం ఆదేశించింది. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్ పరిశీలించింది. కార్డులను ఆన్​లైన్ ద్వారా అనుసంధానించి లబ్ధిదారుని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. దళితవాడల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... గ్రామంలోని మిగతా ప్రాంతంతో సమానంగా అన్ని హంగులూ దళిత వాడలకు కల్పించాలని... ఇందుకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:cabinet: కొవిడ్ పరీక్షలు పెంచండి.. వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయండి: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details