భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ నుంచి ప్రారంభమైన యాత్ర కూకట్పల్లి ఐడీఎల్ చెరువు వద్దకు రాగానే తెరాస అనుబంధ దళిత సంఘాలు పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని నిరసనకు దిగారు. భవనం పేరు విషయంలో కేంద్రం వైఖరి వెల్లడించాలని వారు స్పష్టం చేశారు. లేదంటే సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు సిద్దమని నినాదాలు చేశారు.
పార్లమెంట్‌కు అంబేడ్కర్ పేరు ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన బండి: దిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల బండి సంజయ్‌ను కలిసిన ప్రజాగాయకుడు గద్దర్ పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతి పత్రం సమర్పించారు. గద్దర్ విజ్ఞప్తిని బండి కేంద్రానికి పంపించారు.