DA For TSRTC Employees : టీఎస్ఆర్టీసీ (TSRTC) యాజమాన్యం తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పెండింగ్లో ఉన్న కరువు భత్యాలు (డీఏ) అన్నింటిని మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్(RTC MD Sajjanar) తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు.
How to Apply TSRTC Student Bus Pass : ఆన్లైన్లో బస్పాస్.. ఇంటి నుంచే పొందండిలా..!
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారని తెలిపారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసిందని చెప్పారు. తాజాగా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించిందని సజ్జనార్ వెల్లడించారు.
ఇటీవలే ఈ సంవత్సరం జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీప్రకటించిన విషయం తెలిసిందే. పెండింగ్లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేసింది. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని అధికారులు తెలిపారు.
TSRTC Special Buses For Dussehra Festival 2023 : మరోవైపు దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరా పండుగ సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక బస్సుల్లోనూ ఆర్టీసీ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు యాజమాన్యం పేర్కొంది.