చేతికొచ్చిన పంట వర్షార్పణం.. మాండౌస్ దెబ్బతో అల్లాడిపోయిన రైతాంగం.. Cyclone Mandus caused damage to farmers: మాండౌస్ తుపాను ప్రభావంతో మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతుల్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఓదెల మీదున్న ధాన్యం పూర్తిగా తడసిపోయింది. కొంతమంది ఇళ్లకు తరలించినప్పటికీ.. నిల్వ చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో ధాన్యం రంగుమారుతోందని రైతులు వాపోతున్నారు. పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో పత్తి మూడోసారి తీసేందుకు రైతులు సిద్ధమవుతుండగా.. వర్షంతో పంట దెబ్బతిన్నదని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వానల వల్ల నష్టాలు తప్పేలా లేవని మిరప రైతులు దిగాలు పడుతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రైతుల ఆశలకు తుపాను గండి కొట్టింది. పెనమలూరు,గుడివాడ, పామర్రు, నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వర్షపు నీరు బయటకు పోయే అవకాశం లేకపోవడంతో వరి కుళ్ళి మొలకలు వస్తాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట కోసి ధాన్యాన్ని ఆరబెట్టుకున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మేజర్ అండ్ మైనర్ డ్రైన్లు పూడిక తీయకపోవటంతో వర్షపు నీరు పొలాల్లోనే ఉండటంతో నష్ట తీవ్రత పెరుగుతోందని అన్నదాతలు వాపోతున్నారు..
పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో మిరప, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ధాన్యం వర్షాలకు తడిసిపోయింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో సుమారు 6 వేల ఎకరాల్లో వరి పూర్తిగా నేలకొరిగింది. రెండు వేల ఎకరాల్లో రైతులు వరి కుప్పలు వేసుకున్నారు. వేయి ఎకరాల్లో ధాన్యం ఆర బెట్టుకున్నారు. ఎడతెరిపిలేని వానలకు పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. మినుము రైతులదీ ఇదే వ్యథ. మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని వేలాది ఎకరాల మెట్ట పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఏటా కోసిన వెంటనే ధాన్యాన్ని అమ్ముతుండగా.. ఈ సారి రైతు భరోసా కేంద్రానికే అమ్మాలనే నిబంధన వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ఏలూరు జిల్లా చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టీ నర్సాపురం మండలాల్లో వర్షాలకు వరి పంట దెబ్బతింది. కల్లాల్లోని ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు బరకాలు అందుబాటులో లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగు మారిందని ధర తగ్గించకుండా కొనుగోలు చేయలేని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. కోనసీమ జిల్లాలో జోరు వానలకు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ ఫుట్ సబ్సిడీతో పాటు ప్రత్యామ్నాయాలు చూపించి ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు..
ఇవీ చదవండి: