Cyclone immense damage in Rayalaseema: మాండౌస్ తుపాను దెబ్బకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వానలకు నెల్లూరు నగర శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రామిక నగర్, తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, చంద్రబాబు నగర్, మల్లయ్యగుంట ప్రాంతాలు నీటిలో నానుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పెద్దూరు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. కోవూరు మండలం వేగురు కాలువలో పడి ఓ మహిళ గల్లంతైంది...
చెరువులా మారిన పొలాలు: నెల్లూరు జిల్లాలో నెలన్నర కిందటే వేలాది ఎకరాల్లో రైతులు రబీ సాగు పనులు ప్రారంభించారు. ఎకరాకు 15 నుంచి 20 వేలు ఖర్చు చేసి వరి నాట్లు వేశారు. జిల్లాలోని కోవూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, అల్లూరు, విడవలూరు, కొడవలూరు ప్రాంతాల్లో వరి పంట వేయగా....తుపాను దెబ్బకు పొలాలు నీట మునిగాయి. కాలువల్లో పూడిక తీయకపోవడంతో వరద నీరు బయటకు పోయే మార్గం లేక పంట పొలాలు చెరువులా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..