CYBER CRIMES: అంతర్జాలం విస్తృతితో ఆన్‌లైన్ స్నేహాలు ఎల్లలు దాటుతున్నాయి. పెద్దవాళ్లు ఫేస్‌బుక్, వాట్సప్‌లలో.., యువత, విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. సామాజిక మాధ్యమ ఖాతాలకు అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లనూ ఎడాపెడా అంగీకరించేస్తున్నారు. ఈ పరిణామం నేరమయ మనస్తత్వం కలిగిన వ్యక్తులకు(సైబర్ ప్రెడేటర్స్) వరంగా మారుతోంది. రహస్యంగా ఉంటాయనే ఉద్దేశంతో ఫోన్‌లో దాచుకున్న వ్యక్తిగత సమాచారం, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. మొత్తంగా నట్టింటి పరువు కాస్తా నెట్టింట్లో అంగడి సరకుగా మారిపోతోంది. ముఖ్యంగా మహిళలు సైబర్ నేరగాళ్ల బారినపడి ఆత్మహత్యల దిశగా అడుగులేస్తుండగా, మగాళ్లు జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
ముందు చాటింగ్..తర్వాత గ్రూమింగ్..సైబర్ నేరగాళ్లు కొంతకాలం మర్యాదగానే చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకుంటున్నారు. అవతలి వ్యక్తికి తమపై నమ్మకం పెరిగిందని రూఢి చేసుకున్నాక తర్వాతి అంకానికి తెర తీస్తున్నారు. మెల్లిగా వ్యక్తిగత చిత్రాలు, ఏకాంత వీడియోల్లాంటి సమాచారం రాబట్టే కార్యకలాపాల(గ్రూమింగ్)కు పాల్పడుతున్నారు. ఆ సమాచారం కాస్తా చేతికి చిక్కిన తర్వాత ‘సెక్స్‌టార్షన్(లైంగిక కోరికలు తీర్చాలనే బెదిరింపులు)’కు తెరతీస్తున్నారు. అలాంటి బెదిరింపులకు లొంగి మానసిక వేదనతో కుంగిపోతున్న బాధితురాళ్లు తెలుగు రాష్ట్రాల్లో వేలల్లో ఉన్నట్టు తమకొచ్చిన ఫిర్యాదుల ద్వారా తెలుస్తోందని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు.
‘‘పలు సందర్భాల్లో యువకులూ సెక్స్‌టార్షన్ బారినపడి పరువు పోతుందనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సైబర్ ప్రెడేటర్స్ బారిన పడకుండానూ వ్యక్తిగత సమాచార తస్కరణ జరుగుతుందనేది చాలామందికి తెలియని విషయం. సామాజిక మాధ్యమ ఖాతాల్లోంచి దాదాపు వంద మంది మహిళల చిత్రాలను డౌన్‌లోడ్ చేసి యూట్యూబ్‌లో అశ్లీల వీడియోలు చేసిన యువకుడిని ఈ నెల 22న సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడమే దానికి నిదర్శనం’’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
మీ సెల్‌ఫోనే మీ శత్రువు..చాలా మంది వ్యక్తిగత చిత్రాలను, వీడియోలను సెల్‌ఫోన్లలో నిక్షిప్తం చేస్తుంటారు. ఫోన్ తమ దగ్గరే ఉంటుంది కాబట్టి అవన్నీ రహస్యంగానే ఉంటాయనే భ్రమలో ఉంటారు. వాస్తవంగా ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్లలోని గూగుల్ అకౌంట్‌లో ‘ఆటో సింక్’ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటోంది. ఎప్పటికప్పుడు గూగుల్ అకౌంట్‌కు అనుసంధానమై ఉన్న మెయిల్‌లోకి సమాచారం అంతా నిక్షిప్తమయ్యేందుకు అది ఉపయోగపడుతుంది. వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు కూడా ఆ ఖాతాలోకి చేరిపోతాయి. పొరపాటున మెయిల్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇతరులకు తెలిసిపోతే సదరు సమాచారమంతా నేరగాళ్ల చేతిలోకి వెళ్లినట్టే. చాలామంది సైబర్ నేరస్థులు లింక్‌లను పంపడం ద్వారా కొన్ని ఫోన్లను హ్యాక్ చేస్తూ..వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను చేజిక్కించుకుని లైంగిక వేధింపులు, లేదంటే డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారు.
మరమ్మతుల వేళ..రిడీమ్ మాయ..స్మార్ట్‌ఫోన్లకు, ల్యాప్‌టాప్‌లకు మరమ్మతులు సాధారణమే. అలాంటి సమయాల్లో వాటిని బాగుచేసేందుకు ఇచ్చినప్పుడు డేటా చోరీకి ఆస్కారం ఏర్పడుతోంది. వాటిల్లోని వ్యక్తిగత చిత్రాలను, వీడియోలను మరమ్మతుదారులు కాజేసి అశ్లీల సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారు. అలా చేసినందుకు సదరు సైట్ల నిర్వాహకులు వారికి ప్రోత్సాహకాలు (రిడీమ్ కూపన్స్) ఇస్తారు. తెలుగు మాటలతో ఉన్న వీడియోలకైతే ఆయా సైట్లలో గిరాకీ ఎక్కువని, ఎక్కువ మొత్తం ఇస్తారని పోలీసులు చెబుతున్నారు.
లైవ్ వీడియో కాల్స్‌తో జరభద్రం..యువతీయువకులు లైవ్ వీడియో కాల్స్ చేసుకోవడం ఇప్పుడు సాధారణమైపోయింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి నగ్నంగా చాటింగ్ చేసుకుంటున్నారు. ఎదుటి వ్యక్తిపైౖ ఉన్న నమ్మకం, అవి రికార్డు కావనే భావనతో వాటిని కొనసాగిస్తున్నారు. వాస్తవానికి లైవ్‌చాటింగ్ రికార్డు కాదు. కానీ ప్రస్తుతం కొన్ని టూల్స్ అందుబాటులోకి రావడంతో వాటిని ఎనేబుల్ చేయడం ద్వారా కేటుగాళ్లు వాటిని రికార్డు చేస్తున్నారు. తర్వాత వాటిని అశ్లీల సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారు.
- తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిందో యువతి. వచ్చిన లైక్‌లను చూసి ఆనందపడిపోయింది. కానీ ఆ చిత్రాన్ని సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేయడంతో అది కాస్తా లైంగిక వేధింపులకు దారితీసింది.
- ఓ జంట తమ ఏకాంత వీడియోలను ఫోన్‌లో నిక్షిప్తం చేసుకున్నారు. మనకి తప్ప ఎవరికి తెలియదులే అనుకున్నారు. అవి మోసగాళ్ల చేతికి చిక్కి పోర్న్ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షం అయ్యేసరికి వణికిపోయారు.
- తాను చేసే పోస్టులు ఎక్కువమందికి చేరాలనే ఉద్దేశంతో ఓ యువతి ఫేస్‌బుక్ ఖాతాలో ముక్కూమొహం తెలియనివారి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లనూ యాక్సెప్ట్ చేసింది. కొద్దిరోజుల తర్వాత ఆమె పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచిన కొందరు.. అందులో ఆమెనో వేశ్యగా చిత్రీకరించడంతో హతాశురాలైంది.
ఇవిగో జాగ్రత్తలు..
- సామాజిక మాధ్యమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దు. ముఖ్యంగా మహిళలు..అత్యంత నమ్మకమైన వ్యక్తులు అడిగినా పంపొద్దు. ఒకవేళ నమ్మకస్థులు వాటిని బహిర్గతం చేయకున్నా, సైబర్ నేరస్థులు హ్యాకింగ్ పరిజ్ఞానంతో వాటిని కాజేసే ప్రమాదముంది.
- సామాజిక మాధ్యమ ఖాతాలకు అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు. ఫేస్‌బుక్ లాంటి ఖాతాల్లో ప్రొఫైల్‌ను లాక్‌చేసే సదుపాయాన్ని వినియోగించుకోవాలి.
- ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి ఖాతాల్లో ‘రిపోర్ట్ యూజర్’ ఆప్షన్ ఉంటుంది. ఏదైనా సైబర్ నేరం బారినపడితే వెంటనే ఆ ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
- ఎలక్ట్రానిక్ ఉపకరణాల వెబ్ కెమేరాలను అవసరమైతే తప్ప ఆపేసి ఉంచాలి. ఆన్‌లో ఉంటే సైబర్ నేరస్థులు హ్యాక్ చేసి రికార్డు చేసే ప్రమాదం ఉంటుంది.
- సామాజిక మాధ్యమ ఖాతాలకు ఇతరులు గుర్తించలేని పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకోవడంతోపాటు, తరచూ వాటిని మారుస్తూ ఉండాలి.
- ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్(ఖాతాలోకి మరెవరైనా లాగిన్ అయితే ఫోన్‌కూ మెసేజ్ రావడం లాంటిది)’ ఏర్పాటు చేసుకోవాలి.
సామాజిక మాధ్యమాల్లోని సమాచారం రహస్యంగానే ఉంటుందని అపోహలో ఉండటం ఆత్మహత్యా సదృశమే. ఖాతాల్లో ప్రైవసీ సెట్టింగ్‌లోకి వెళ్లి ‘ఓన్లీ ఫ్రెండ్స్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే ఆస్కారం ఉంది. సెల్‌ఫోన్‌లో గూగుల్ ఆటో సింక్రనైజేషన్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకుంటే ఫోన్‌లోని చిత్రాలు, వీడియోలు గూగుల్ క్లౌడ్‌లో నిక్షిప్తం కావు. అసలు వ్యక్తిగత చిత్రాల్ని, వీడియోల్ని సెల్‌ఫోన్లలో రికార్డు చేసుకోకపోవడమే ఉత్తమం. మహిళలు ఒంటరిగా ఉన్న ఫొటోలను సైబర్ నేరస్థులు మార్ఫింగ్‌కు వినియోగించుకునే అవకాశాలు ఎక్కువ కాబట్టి అలాంటివి పోస్ట్ చేయకపోవడం మంచిది. - ప్రసాద్ పాటిబండ్ల, సీఆర్‌సీఐడీఎఫ్ డైరెక్టర్
ఇవీ చదవండి: