Hyderabad Cyber Crime Police Special Drive : రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు, పెట్టుబడుల పేరిట నిరుద్యోగులను మోసం చేసే సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా గుర్తిస్తున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున సొమ్ము స్వాధీనం చేసుకొని బాధితుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరు 1930 ద్వారా వచ్చే ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులను ఛేదించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
ఈ డ్రైవ్‌లో భాగంగా బాధితుల నుంచి నగదు జమచేసిన బ్యాంకు ఖాతాలు, వాలెట్ నెంబర్లను అధ్యయనం చేశారు. ఆయా బ్యాంకుల అధికారులు, పోలీసుల సమన్వయంతో విచారణ చేపట్టారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాలను గుర్తించి వాటిని స్తంభింపజేశారు. బాధితులతో న్యాయస్థానంలో అండర్ సెక్షన్ 457 సీఆర్‌పీసీ ప్రకారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయించిన అధికారులు..బాధితుల నుంచి కొట్టేసిన సొమ్ము కొన్ని బ్యాంకు ఖాతాల ద్వారానే లావాదేవీలు జరిపినట్టు రుజువు చేశారు. నష్టపోయిన బాధితులకు నగదు తిరిగి ఇవ్వమంటూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో ఆయా బ్యాంకుల నుంచి రికవరీ చేశారు. ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల రూపాయల నగదు రికవరీ చేసి 44 మంది బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.
FedEx Courier Cyber Crimes : రూట్ మార్చిన కేటుగాళ్లు.. కొరియర్ సంస్థల పేరిట బెదిరింపు కాల్స్
Cyber Fraud Gang Arrest in Hyderabad: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ బృందాలు మూడు నెలల పాటు శ్రమించి బ్యాంకు ఖాతాల నిర్వహణ, లావాదేవీల నుంచి చట్టపరంగా సొత్తు బాధితులకు ఇప్పించారు. సైబర్ నేరాల్లో సొత్తు రికవరీలో గుజరాత్ ప్రథమ స్ధానంలో ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, దర్యాప్తులో ప్రస్తుతం తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.
"ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులతో ఆకట్టుకొనే మాయగాళ్లు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించుకుంటున్నారు. ఆ నగదును వేర్వేరు ఖాతాలకు మళ్లించి చివరిగా క్రిప్టో కరెన్సీగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. క్రిప్టోగా మారిన సొమ్మును తిరిగి రాబట్టడం అసాధ్యం. సైబర్ నేరాల్లో మోసపోయినట్టు గుర్తించగానే వీలైనంత వేగంగా బాధితులు 1930, ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి. ఎంత త్వరితగతిన ఫిర్యాదు చేస్తే అంతే వేగంగా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, సొత్తును రికవరీ చేయొచ్చు." అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.