ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తుపదార్థాల నియంత్రణే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మత్తు దందా(Drug business)పై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్, గంజాయి విక్రేతలు, సరఫరాదారుల సమాచారం సేకరించి వారిపై నిఘా ఉంచారు. వరుసగా మూడు రోజుల నుంచి నిర్వహించిన దాడుల్లో 9 మందిని అరెస్టు చేసి ఎనిమిది మందిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 8.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మొక్క కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
యువత భవిష్యత్ కోసం అవగాహన కార్యక్రమాలు..
మాదకద్రవ్యాల వాడకంపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబటిన వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. యువత మత్తు ఉచ్చులో చిక్కుకుని భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం ఇంట్లో పిల్లలపై చెడుదారుల్లో వెళ్లకుండా పర్యవేక్షించాలని అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి, గుట్కాలాంటి మత్తుపదార్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు మాదకద్రవ్యాల రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు. మత్తు విక్రయాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే డయిల్ 100 లేదా సైబరాబాద్ ఎన్‌డీపీఎస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నెంబర్ 79011 05423కు, సైబరాబాద్ పోలీసుల వాట్సప్ నెంబర్ 94906 17444కు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఇదీ చదవండి:గంజాయి మొక్కల కలకలం.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే పెంపకం..