హైదరాబాద్‌లోని మాదాపూర్ దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన రాకపోకలపై సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. సందర్శకుల తాకిడి పెరగడం, కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు వరకు వంతెనపై రాకపోకలను పూర్తిగా నిషేధించారు. మిగితా వారాల్లో రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు వరకు వాహనాలు, పాదచారులను వంతెనపైకి అనుమతించబోమని తెలిపారు.
తీగల వంతెనపై ఆంక్షలు... అతిక్రమిస్తే చర్యలే - తీగల వంతెనపై పోలీసుల ఆంక్షలు
దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనకు సందర్శకుల తాకిడి అధికంగా ఉన్నందున సైబరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు వంతెనపై రాకపోలకలను పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తీగల వంతెనపై ఆంక్షలు... అతిక్రమిస్తే చర్యలే
వంతెనకు ఇరువైపుల కూర్చోవడం, నిలబడడం, రెయిలింగ్ వద్దకు వెళ్లడాన్ని పోలీసులు పూర్తిగా నిషేధించారు. వాహనాలు బ్రిడ్జిపై నిలపడం, జన్మదిన వేడుకలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. ఎక్కువమంది గుమిగూడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు తీగల వంతెనపై రాకపోకలు సాగించే వాహనాలు 35 కిలోమీటర్ల వేగం మించరాదని స్పష్టం చేశారు. బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతామని, అందుకు సీసీ కెమారాలు అమర్చినట్లు వెల్లడించారు.