దొంగతనం జరిగినప్పుడు పోలీస్ కేసు పెట్టినా చోరీకు గురైన వస్తువు దొరకడమంటే కష్టమే. ఒకవేళ పోలీసులు పట్టుకున్నా... రికవరీ సొత్తు (Recovery Property)ను కోర్టు ద్వారా బాధితులు తీసుకోవటం అంతా సులువు కాదు. ఈ పరిస్థితుల్లో పోయిన వస్తువు దొరికిందని సంతోషపడాలా? న్యాయస్థానం చుట్టూ తిరగలేక బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇందుకోసమే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police). పోగొట్టుకున్న వారి వస్తువులు నిందితుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకుని... బాధితుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నారు.
ప్రణాళికలు...
ఇందుకోసం క్రైం టీం, సీసీఆర్బీ (CCRB), కోర్టు మానిటరింగ్ సిబ్బందితో సమావేశమైన సీపీ సజ్జనార్... ప్రాపర్టీ రిలీజ్ మేళా అనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 36 పోలీస్ స్టేషన్‌లను సమన్వయం చేసి... న్యాయమూర్తులతో మాట్లాడి కోర్టులో కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలను పోలీసులే చూసుకునేలా చేశారు. రికవరీ అయిన వస్తువులను బాధితులకు అందజేసేలా కోర్టు అనుమతితో ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగానే సైబరాబాద్ కమిషనరేట్ మైదానంలో రికవరీ మేళాను నిర్వహించారు. దొంగతనాల్లో కోల్పోయిన వస్తువులు ఇక దొరకవని భావించవద్దని... చోరీ జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తొందరగా పట్టుకునేందుకు అవకాశముంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.