police arrested suspect in data theft case : ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేరగాళ్లు పౌరుల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. 16.8 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా చోరీ కేసు మరువకముందే తాజాగా మరో సంచలన కేసు బయటపడింది. ఏకంగా 66.9 కోట్ల మందికి చెందిన డేటాను దిల్లీకి చెందిన వినయ్ భరద్వాజ్ దర్జాగా విక్రయిస్తున్నాడు. అమర్ సోహైల్, మదన్ గోపాల్ నుంచి డేటా కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్లతో పాటు ఇతర వ్యాపార ప్రకటనలు అవసరమున్న వారికి అమ్ముతున్నాడు. ఫరీదాబాద్ కేంద్రంగా 8 నెలలుగా ఈ దందా సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన రహస్య, సున్నిత సమాచారం ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
చోరీ కోసం ప్రత్యేక వెబ్‌సైట్: దేశవ్యాప్తంగా జీఎస్టీ చెల్లింపులు, ఆర్టీవోలో నమోదైన వ్యక్తులు, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, బిగ్ బాస్కెట్, ఇన్‌స్టాగ్రామ్, జొమాటో, పాలసీ బజార్ వినియోగదారుల వివరాలు లభించాయి. హర్యానాలో ఫరీదాబాద్ కేంద్రంగా క్లౌడ్ డ్రైవ్ లింకుల ద్వారా సమాచారం విక్రయిస్తున్నాడు. డేటా విక్రయించేందుకు ఇన్‌స్పైర్ వెబ్స్ పేరుతో వెబ్‌సైట్ సృష్టించాడు. సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ ప్రచారం చేస్తున్నాడు. ఏ రాష్ట్రంలో ఏ విభాగం ప్రజల డేటా అవసరమో తెలుసుకుని దాని ధర నిర్ణయించి విక్రయిస్తున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన 55 లక్షల మంది డేటా చోరీ: త్వరగా డౌన్‌లోడ్ కావాలంటే తాను పంపే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నాడు. నిందితుడి వద్ద తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండున్నర కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా లభ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2 కోట్ల పది లక్షల మంది, హైదరాబాద్‌కు చెందిన 55 లక్షల మంది డేటా నిందితుడి వద్ద పోలీసులు కనుగొన్నారు. యూపీకి చెందిన 21 కోట్ల మంది, నాలుగున్నర కోట్ల మహారాష్ట్ర వాసుల సమాచారం వినయ్ భరద్వాజ వద్ద లభించింది.