Cyberabad Police Approached The Ts High Court: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల రిమాండ్ తిరస్కరణ పట్ల పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రామచంద్రభారతి, సతీశ్ శర్మ, నందుల రిమాండ్ తిరస్కరణపై వాదనలు విన్న హైకోర్టు.. రేపు తేలుస్తామని తెలిపింది. విచారణ సందర్భంగా ముగ్గురు నిందితులకు ఆంక్షలు విధించిన ఉన్నత న్యాయస్థానం.. నిందితులు 24 గంటల పాటు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు విధించింది. అప్పటి వరకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా కేసుతో సంబంధం ఉన్న వారెవరితోనూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంప్రదించవద్దని స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. పోలీసుల పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
12:09 October 28
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. పోలీసుల పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
తెరాస ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. రామచంద్రభారతి, సోమయాజులు, నందులకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు.
ముగ్గురు నిందితులు తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారనేందుకు పోలీసుల వద్ద తగిన ఆధారాలున్నాయని ఏజీ వాదించారు. ముగ్గురు నిందితులు ప్రభుత్వంపై నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని అడ్వొకేట్ జనరల్ వాదించారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపించకపోతే విదేశాలకు పారిపోయే అవకాశం ఉండటంతో పాటు సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు. అన్ని కేసుల్లో సీఆర్పీసీ 41ఏ సెక్షన్ పాటించాల్సిన అవసరం లేదని.. ఇందుకు పలు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఏజీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
సీఆర్పీసీ 41ఏ సెక్షన్ పాటించాల్సిందేనని.. ముగ్గురిపై తప్పుడు కేసులు బనాయించారని నిందితుల తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం.. శనివారం విచారణ కొనసాగించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. విచారణ సందర్భంగా నిందితులకు ఆంక్షలు విధించిన హైకోర్టు.. ముగ్గురూ 24 గంటల పాటు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతు విధించింది. అప్పటి వరకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా కేసుతో సంబంధమున్న వారెవరితోనూ ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదించవద్దని.. సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. తమ చిరునామాను వెంటనే సైబరాబాద్ సీపీకి సమర్పించాలని నిందితులను ఆదేశించింది.
ఇవీ చదవండి: