మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు పంథాను మార్చుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో అమెజాన్ స్పిన్ వీల్‌తో బహుమతులంటూ బోల్తా కొట్టించిన సైబర్ నేరస్థులు.. తాజాగా మరో లింక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు చేస్తున్నారు. చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానం వస్తే టాటా సఫారి గెలుచుకోవచ్చంటూ ఆ లింక్ సారాంశం. నిజంగానే కానుకలు వస్తాయనే ఆశతో క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లు చెప్పిన లింక్‌ను పలువురికి షేర్ చేస్తున్నారు. తాము వంచనకు గురికావడమే కాకుండా మరికొందరు మోసపోయేలా చేసినట్టేనని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు పంపే లింక్‌లను ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాలోని సొమ్ము ఖాళీ కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
సీజన్‌ను బట్టి సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో కొత్త తరహాలో ప్రజల సొమ్ము దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్ గెలుచుకోండంటూ సైబర్ నేరగాళ్లు లింకులు పంపారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గిప్ట్, డీమార్ట్ 20 ఏళ్ల ఉత్సవం అంటూ స్పిన్ వీల్ వాట్సప్‌లో ప్రచారం జరిగింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి.. ఇలాంటివి నమ్మొద్దని హెచ్చరించారు. ఈ లింకులు ఎవరు పంపిస్తున్నారనే దానిపై దర్యాప్తు చేసినా.. ఫలితం ఉండదని పోలీసులు చెబుతున్నారు. ప్రజలు ఇలాంటి సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.