Frauds of customer care centers: కొత్తగా మీరు వాషింగ్ మెషీన్ కొన్నారా..? కొన్ని తర్వాత కొద్దిరోజులకే అది రిపేర్ వచ్చిందా.. అలాగని గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికితే ఇక మీ పని అంతే. గత కొన్ని నెలలుగా ఈ తరహా మోసాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో నగరంలో సుమారు 200దాకా ఇలాంటి తరహా కేసులు నమోదయ్యాయి.
పేరు పొందిన సంస్థలను పోలిన నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి.. ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. హరియాణా, ఝార్ఖండ్ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలు ఇస్తే అసలైన వెబ్‌సైట్ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు. గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో గూగుల్‌లో నకిలీదే ముందు కనిపిస్తుంది. వీటిని నమ్మి బాధితులు మోసపోతున్నారు.
రూ.8 కోట్లు హాంఫట్:హైదరాబాద్ జంటనగరాల్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఇలాంటి మోసాలు దాదాపు 200 వరకూ నమోదు కాగా.. బాధితులు రూ.8 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. మున్ముందు ఇలాంటివి పెరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ కోసం మీరు గూగుల్‌లో వెతికినప్పుడు ముందుగా వచ్చిన నంబర్‌ను నమ్మొద్దు. అది కరెక్ట్ నంబరా లేదా ఫేక్ నంబరా అనేది చెక్ చేసుకోవాలి. సాధారణంగా ప్రతి కంపెనీ తమ ప్రాడక్ట్స్, యూజర్ గైడ్ బుక్స్, రసీదులపై తమ కస్టమర్ కేర్ నంబర్‌ను ప్రింట్ చేసి ఉంచుతుంది. వీలైనంత వరకు మీరు వాటిని సంప్రదించాలి.
బ్యాంకులు డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుతాయి. అధికారిక వెబ్‌సైట్లు హెచ్‌టీటీపీ, ప్యాడ్‌లాక్(తాళం గుర్తు)తో మొదలవుతాయి. ఓ హైదరాబాద్ వాసి ఆన్లైన్లో బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. వేరే పనులు ఉండటం వల్ల రిజర్వేషన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆన్లైన్లో కస్టమర్ కేర్ నంబర్ కోసం సర్చ్ చేసి చివరకు అది ఫేక్ కావడంతో సైబర్ కేటుగాళ్ల చేతిలో బుక్కయ్యాడు. బాధితుడు నుంచి రూ.1. 89లక్షలు కాజేశారు.