Cyber Frauds In Hyderabad :భాగ్యనగరంలో నిరుద్యోగంతో పాటు అంతంత సంపాదనతో ఇబ్బంది పడుతున్న కొందరు ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటన కనిపించగానే నమ్మేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోంతో ఇంట్లోనే ఉండొచ్చొనే ఉద్దేశంతో లక్షల వేతనం తీసుకుంటున్న ఐటీ నిపుణులు అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు. అలా పదవ తరగతి కూడా పాస్ కానీ కేటుగాళ్ల చేతిలో మోసపోతున్నారు.
ఈ కేటుగాళ్లు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడులు, బహుమతులు, విదేశీ సంబంధాల పేరిట ఉన్నత విద్యావంతులను బురిడీ కొట్టిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కేసులు, అరెస్ట్‌లు, జైళ్ల నుంచి తప్పించుకునేందుకు ముఠాలు కొత్తమార్గాలు ఎంచుకుంటున్నాయి. ఆనవాళ్లు బయటపడకుండా పోలీసులను ఏమార్చుతూ చాకచక్యంగా తప్పించుకుంటున్నట్టు ఇటీవల సైబర్‌క్రైమ్‌పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
67కోట్ల మంది డేటా ఒక్కడే చోరీ చేశాడా..! అసలు నిందితులు ఎవరు?
Cyber Criminals Cheated Software Employees In Hyderabad : హైదరాబాద్ టోలిచౌకిలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంపాదన ఏడాదికి 20లక్షలు. ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ అనే లింక్ కనిపించగానే ఆశపడ్డారు. ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నాం కదా కేవలం గంట సమయం కేటాయిస్తే రోజూ 2000 అని ఉండటంతో ఎలా చూసినా నెలకు 60వేలు చేతికి రావటం పక్కా అనుకున్నారు. అంతే ఉద్యోగం, పెట్టుబడి అనగానే ఆశపడి 12లక్షలు పోగొట్టుకున్నారు.
మరోవైపు నారాయణగూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి నిర్వాణ డిజిటల్ పేరుతో టెలిగ్రామ్ లింక్‌తో పెట్టుబడి పెడితే అసలు, లాభం, బోనస్ అంటూ 10,000 మొదటి వాయిదా కట్టించుకున్నారు. టాస్క్‌లు ఇస్తూ విజేతగా నిలిచారంటూ కొంత నగదు ఖాతాలో జమచేసి నమ్మకం కలిగించిన సైబర్‌క్రైమ్ కేటుగాళ్లు 5లక్షలు కాజేసి టెలిగ్రామ్ ఖాతాను బ్లాక్ చేశారు. ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ సైబర్ మోసగాళ్లు చదువుకున్న వారిని బురిడికొట్టిస్తున్నారు.