సైబర్ కేటుగాళ్లకు... ప్రజల అవసరాలే అవకాశాలు. ఏమాత్రం ఆసరా దొరికినా.. నయా దందాలతో నిలువునా దోచేస్తారు. ఇలాంటి సైబర్ దోపిడీకి బాధితురాలైంది ఏపీలోని విజయవాడకు చెందిన ఊర్వశి అనే యువతి. హైదరాబాద్‌లో ఉంటున్న ఈమె... ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కిడ్నీ విక్రయించాలనుకుంది. ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో వెతుకున్న సమయంలో... కిడ్నీ దానం చేస్తే రూ.25 లక్షలు ఇస్తామన్న ప్రకటన కనపడింది. ఫోన్‌లో సంప్రదిస్తే... ది నేషనల్ కిడ్నీ ఫౌండేషన్‌లో పేరు నమోదు చేసుకునేందుకు 10 వేల రూపాయలు చెల్లించాలని యువతికి తెలిపారు. మోసం గ్రహించలేకపోయిన ఆమె... డబ్బు జమ చేసింది. ఇలా రకరకాల ఫీజుల పేరుతో నిందితుడు విడతల వారీగా లక్షా 20 వేల రూపాయలు దోచేశాడు.
దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు! - latest news of cyber crimes
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువతి కిడ్నీ విక్రయించేందుకు సిద్ధమైంది. కష్టాల్లో ఉన్న ఆమెకు కిడ్నీ దానం చేస్తే రూ.25 లక్షలు ఇస్తామంటూ... ఓ వెబ్ సైట్‌లో ప్రకటన కనబడింది. ఫోన్ ద్వారా సంప్రదిస్తే... రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో విడతల వారీగా రూ.లక్షా 20 వేలు కాజేశారు. బాధితురాలు కాస్తా పోలీసులను ఆశ్రయించగా.. బయటపడింది ఈ సైబర్ మోసం.
అనుమానం వచ్చిన బాధితురాలు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కిడ్నీ విక్రయాల పేరుతో అమాయకుల నుంచి నగదు దోచుకుంటున్న సైబర్ నేరస్థులని గుర్తించారు. నిందితులు వినియోగిస్తున్న మనీ వ్యాలెట్లు, బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. వాటి నుంచి రూ.90 వేల నగదు స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు.సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని.. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు సూచనలిచ్చారు.